ARCHERY: ఆర్చరీలో ఆసియా ఛాంపియన్ ధీరజ్
తెలుగు కుర్రాడు ధీరజ్ అరుదైన ఘనత.. పురుషుల రికర్వ్‌లో వ్యక్తిగత గోల్డ్ మెడల్.. ఆసియాఛాంపియన్షిప్లో తొలి గోల్డ్
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు, విజయవాడకు చెందిన బొమ్మదేవర ధీరజ్ అదరగొట్టాడు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న టోర్నీలో పురుషుల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించి ఆసియా చాంపియన్‌గా అవతరించాడు. శుక్రవారం జరిగిన ఫైనల్ ధీరజ్ 6-2 తేడాతో మరో భారత ఆర్చర్ రాహుల్‌ను ఓడించాడు. నాలుగు సెట్లలో జరిగిన పోరులో ధీరజ్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండు సెట్లలో గెలవగా మరో రెండు సెట్లను డ్రా చేసుకున్నాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో ధీరజ్ బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి. రాహుల్ రజత పతకం దక్కించుకున్నాడు. గురువారం తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్స్‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది.
భారత్‌కు స్వర్ణం
పురుషుల టీమ్ విభాగంలో భారత్ స్వర్ణంతో మెరిసింది. అతాను దాస్, రాహుల్, యశ్దీప్లతో కూడిన భారత బృందం ఫైనల్లో 5-4తో కొరియా (సియో మింగి, కయెచాన్, జంగ్ జిహో)ను ఓడించింది. ఈ పోరులో 2-4తో వెనుకబడిన స్థితి నుంచి పుంజుకుని భారత్ గెలిచింది. ఫైనల్లో భారత్, కొరియా చెరో నాలుగు సెట్ పాయింట్లు గెలుచుకోవడంతో షూటాఫ్ తప్పని సరైంది. షూటాఫ్‌లోనూ 29-29తో స్కోర్లు సమమయ్యాయి. భారత ఆటగాళ్లలో చివరిగా అతాను దాస్ వేసిన బాణం మధ్య వృత్తానికి సమీపంగా దిగడంతో భారత్ విజేతగా నిలిచింది. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రికర్వ్ టీమ్ విభాగంలో భారత్‌కు పసిడి దక్కింది. చివరిగా 2009లో ఈ విభాగంలో మన దేశం విజేతగా నిలిచింది. అప్పుడు గెలిచిన జట్టులో సభ్యుడైన రాహుల్ బెనర్జీ.. ప్రస్తుత జట్టుకు కోచ్ కావడం విశేషం. 6 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యంతో భారత్ అగ్రస్థానంతో ఈ టోర్నీని ముగించింది. కొరియా కూడా 10 (2 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలు) పతకాలు గెలిచినా.. అత్యధిక స్వర్ణాలతో భారత్ ముందంజలో నిలిచింది.
సురేఖ డబుల్ ధమాకా
జ్యోతి సురేఖ ముందుండి నడిపించడంతో.. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత కాంపౌండ్ ఆర్చర్లు మూడు స్వర్ణాలు, రెండు రజతాలు కొల్లగొట్టారు. సీనియర్ ఆర్చర్ సురేఖ టీమ్‌తోపాటు వ్యక్తిగత స్వర్ణంతో రాణించింది. గురువారం జరిగిన మహిళల టీమ్ ఫైనల్లో సురేఖ, దీప్షిక, ప్రతీక ప్రదీ్‌పల త్రయం 236-234తో కొరియాపై గెలిచి పసిడి పతకం సొంతం చేసుకొంది. తొలి సెట్లో 59-59తో సమంగా నిలిచినా రెండో సెట్లో భారత్ 59-58తో కొరియాపై ఆధిక్యం సాధించింది. మూడో సెట్ 59-59తో సమం కాగా.. నాలుగో సెట్లో 59-58తో పైచేయి సాధించిన భారత్ పసిడి పతకాన్ని సొంతం చేసుకొంది. ఇక, మహిళల వ్యక్తిగత విభాగంలో సహచరి, 17 ఏళ్ల ప్రతీకపై జ్యోతిసురేఖ 147-145తో గెలిచి రెండో బంగారు పతకాన్ని దక్కించుకొంది. దీంతో ప్రతీకకు రజతం లభించింది. మిక్స్డ్ విభాగం స్వర్ణ పోరులో దీప్షిక-అభిషేక్ వర్మ జోడీ 153-151తో బంగ్లాదేశ్ జంటపై గెలిచింది. అయితే, ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పురుషుల జట్టుకు ఫైనల్లో షాక్ తగిలింది. అభిషేక్ వర్మ, రాజేష్ జాదవ్, ప్రథమే్షల త్రయం 229-230 కజకిస్థాన్ బృందం చేతిలో ఓడి రజతానికే పరిమితమైంది. సియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్ అదరగొట్టింది. కాంపౌండ్‌లో ఇప్పటికే దేశ ఆర్చర్లు 3 స్వర్ణాలతో సత్తా చాటగా.. ఇప్పుడు రికర్వ్ క్రీడాకారులు వారి బాటలో నడిచారు.