ASIA CUP: ఆసియా కప్..సమాధానం లేని ప్రశ్నలెన్నో.. ?
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్... భారత జట్టు ఎంపికపై విమర్శలు... పెదవి విరుస్తున్న మాజీ క్రికెటర్లు;
వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌కు బీసీసీఐ.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేపథ్యంలో టీంని ప్రకటించింది. దీంతో ఒక్కటి కాదు రెండో కాదు అనేక గొడవలు తెరపైకి వచ్చాయి. పాక్‌తో మ్యాచులు విషయం ఒకటైతే, కొందరి ప్లేయర్లను ఎందుకు సెలక్ట్ చేశారో మాజీలకు అర్థం కావడం లేదట. అలాగే మరికొందరికి ఎందుకు అవకాశం దక్కలేదో అంతు చిక్కడంలేదట.
రాణా ఎందుకు: చిక్కా
మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా సెలక్షన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్న మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణను కాదని హర్షిత్ రాణాను ఎలా జట్టులోకి తీసుకుంటారని ప్రశ్నించాడు. ‘అసలు టీంలోకి హర్షిత్ రాణా ఎక్కడ నుంచి వచ్చాడు. అతడి ప్రదర్శన ఐపీఎల్‌లోనూ పేలవంగా ఉది. అతడి ఎకానమీ 10గా ఉంది. అతణ్ని ఎంపిక చేసి.. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు?’ అని ఫైర్ అయ్యాడు. " యశస్వి జైస్వాల్ వంటి ప్లేయర్ జట్టులో లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. శుభ్‌మన్ గిల్ ఎంపిక మంచి నిర్ణయమే. అతడి ఆట బాగుంది. భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలోనూ ఆడతాడు. అయితే, జట్టు విజయం కోసం కీలక ఇన్నింగ్స్ ఆడే వారిని పక్కన పెట్టకూడదు. ఆసియా కప్ గెలవగలిగేంత అద్భుతమైన జట్టు మనకుంది." అని మాజీ క్రికెటర్ మదన్ లాాల్ అన్నారు. భారత జట్టు ఎంపికలో సమతుల్యం లోపించినట్లు అనిపిస్తోందని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై బీసీసీఐ అధికారికంగా స్పందించలేదు.
జైస్వాల్‌కు ఏమైంది: అశ్విన్
బీసీసీఐ ప్రకటించిన టీంలో అనూహ్యంగా యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత టీ20 ప్రపంచకప్‌లో బ్యాకప్ ఓపెనర్‌గా ఉన్న యశస్వికి ఇప్పుడు ఆసియా కప్‌లో చోటు కల్పించకపోవడం సరికాదని అశ్విన్ వ్యాఖ్యానించాడు. అతడి స్ట్రైక్‌రేట్ కూడా చాలా బాగుందని గుర్తుచేశాడు. ‘యశస్వి జైస్వాల్‌కు టెస్టు అవకాశం వచ్చినప్పుడు స్వీకరించాడు. ఈ మధ్యకాలంలో టెస్టుల్లోకి అడుగుపెట్టిన అత్యంత విజయవంతమైన క్రికెటర్ యశస్వి. ఏ ఫార్మాట్లో అయినాసరే ఎప్పుడు అవకాశం వచ్చినా వదులుకోలేదు. అయినా సరే అతడికి ఇప్పుడు ఛాన్స్ రాలేదు. ఒక దశలో నాయకత్వం రేసులోనూ నిలిచిన ఆటగాడు ఏకంగా జట్టులోనే లేకపోవడం షాక్‌కు గురిచేసింది. ఈ ఫార్మాట్లో యశస్వి స్ట్రైక్‌రేట్ 165. చాలాసార్లు తన కోసం కాకుండా జట్టు కోసం ఆడే వారిని కనుక్కోవడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో యశస్వి జైస్వాల్ ఉంటే సరిగ్గా సరిపోతాడు. ఆ జాబితాలో శ్రేయస్ అయ్యర్ కూడా ఉంటాడు’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.
శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా, ప్లేయర్‌గా అదరగొట్టాడు. మూడు లేదా నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. 188.15 స్ట్రైక్ రేట్‌తో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొని 397 పరుగులు చేశాడు. స్పిన్ మాత్రమే బాగా ఆడతాడనేది తప్పని ప్రూవ్ చేశాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో కగిసో రబాడా బౌలింగ్‌లో కొట్టిన భారీ సిక్స్‌తో షార్ట్ బాల్స్ ఆడటంలో ఉన్న వీక్నెస్ని అధిగమించినట్లు సిగ్నల్ ఇచ్చాడు. ఇంతగా పర్ఫార్మ్ చేసినా సరే సెప్టెంబర్ 2025లో UAEలో జరిగే ఆసియా కప్‌కి అతన్ని సెలక్టర్లు పట్టించుకోలేదు.