ASIA CUP: నక్కజిత్తుల నఖ్వీ.. నీ ఆటలు సాగవ్
ఆసియా కప్ అందించని పీసీబీ చీఫ్ నఖ్వీ.. సూర్యకుమార్ తన వద్దకే రావాలన్న నఖ్వీ.. అలాంటి కథలు నవబోవని బీసీసీఐ స్పష్టం
ఆసియా కప్‌లో భారత విజయం.. దాయాది దేశాన్ని ఇంకా పీడకలలా వెంటాడుతోంది. ఆసియా కప్ లో ఆడిన మూడు మ్యాచుల్లో పాకిస్థాన్‌ను మట్టికరిపించిన టీమిండియా సగర్వంగా ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే ఫైనల్ మ్యాచ్ అనంతరం స్టేడియంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పీసీబీ చీఫ్, ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా ప్లేయర్స్ తిరస్కరించారు. దాంతో నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు దక్కాల్సిన విజేత పతకాలను కూడా హాటల్‌కు తీసుకెళ్లిపోయాడు. దాంతో పీసీబీ, బీసీసీఐ మధ్య వివాదం చెలరేగింది. ఇప్పటికీ ఆ ట్రోఫీలు, మెడల్స్ నఖ్వీ బస చేస్తున్న హోటల్లోనే ఉన్నాయి. నఖ్వీ తీరుపై ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. అలా ట్రోఫీని ప్రైవేట్ ప్లేస్‌కు తీసుకెళ్లే అధికారం నఖ్వీకి లేదని స్పష్టం చేసింది
నఖ్వీ నక్కజిత్తులు..
భారత జట్టుకు పతకాలు, ట్రోఫీ తిరిగి ఇచ్చే విషయంపై నఖ్వీ స్పందించాడు. దీనికి విచిత్రమైన షరతు పెట్టాడు. మొహ్సిన్ నఖ్వీ టోర్నమెంట్ నిర్వాహకులతో మాట్లాడుతూ, టీమ్ ఇండియా తమ ట్రోఫీ, పతకాలను తీసుకోవచ్చని, అయితే ఇది ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడే సాధ్యమవుతుందని, అందులో అతను స్వయంగా భారత జట్టుకు పతకాలు, ట్రోఫీలను బహుకరిస్తానని చెప్పారు. భారత్, పాకిస్థాన్ మధ్య చెడిన సంబంధాల కారణంగా, అలాంటి కార్యక్రమం జరిగే అవకాశం దాదాపు లేదు. నఖ్వీ తన పట్టుదలతో ఆసియా కప్ ట్రోఫీని తీసుకుని మైదానం నుంచి బయటకు వెళ్ళిపోయారన్న విమర్శలు వస్తున్నాయి.
నఖ్వీ తీరు పట్ల బీసీసీఐ ఫైర్
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్ మోహిసిన్ నఖ్వీ తీరుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నఖ్వీ ట్రోఫీతో పాటు, విజేతలకు ఇచ్చే పతకాలను కూడా తనతో తీసుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించి నిన్న జరిగిన ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. వర్చువల్ రూపంలో సమావేశానికి హాజరైన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ ట్రోఫీ ఏసీసీకి చెందినదే కానీ వ్యక్తిగతంగా నఖ్వీకి సంబంధించింది కాదని గుర్తు చేశారు. ట్రోఫీని భారత జట్టుకు యథావిధిగా అప్పగించాల్సిన బాధ్యత నఖ్వీకి ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని ఏసీసీ వెంటనే పరిశీలించాలని కోరారు. అయితే, తన నుంచి ట్రోఫీని స్వీకరించబోమని భారత జట్టు లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వలేదని ఏసీసీ ఛైర్మన్ నఖ్వీ పేర్కొన్నారు. అనంతరం శుక్లా మరిన్ని ప్రశ్నలు సంధించడంతో సమావేశంలో కాకుండా వేరే వేదికపై చర్చిస్తామని నఖ్వీ తెలిపారు.
చర్చించడానికి ఏమీ లేదు
ఈ క్రమంలో ట్రోఫీ గురించి బీసీసీఐ తమ వాదనను కొనసాగించింది. ట్రోఫీని ఏసీసీ కార్యాలయంలో ఉంచాలని, అక్కడి నుంచి తాము దాన్ని తీసుకుంటామని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. అయితే దీనికి నఖ్వీ అంగీకరించలేదు. ఈ విషయంపై చర్చించాల్సిన అవసరం ఉందని నఖ్వీ అన్నారు. దీనిపై రాజీవ్ శుక్లా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోఫీ తమదేనని, చర్చించడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై నవంబర్‌లో జరిగే సమావేశంలో ఐసీసీకి ఫిర్యాదు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.