ASIA CUP: దాయాదిని చిత్తు చేసిన టీమిండియా
పాకిస్థాన్‌పై భారత్ ఏకపక్ష విజయం.. కనీసం పోటీ ఇవ్వలేకపోయిన పాక్.. 20 ఓవర్లలో 127 పరుగులే చేసిన దాయాది.. 25 బంతులు మిగిలి ఉండగానే గెలిచిన భారత్
ఆసియా కప్ 2025 టోర్నీని హీటెక్కిస్తుందని భావించిన దాయాదుల పోరు తీవ్రంగా నిరాశపర్చింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆదివారం పూర్తిగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియాకు పాకిస్థాన్ కనీస పోటీని ఇవ్వలేకపోయింది. పాక్‌పై భారత్ 25 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో సునాయస విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమైన పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడకుండా పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ముఖం చాటేశాడు.
తిప్పేశారు...చుట్టేశారు
టాస్ గెలిచిన పాక్ జట్టు కెప్టెన్ సల్మాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ అతడి వ్యూహం దారుణంగా బెడిసికొట్టింది. క్రీజులోకి దిగిన ప్రతీ బ్యాటర్ ఎదురుదాడికి దిగే ప్రయత్నంలో చకచకా పెవిలియన్‌కు చేరారు. భారత స్పిన్ త్రయం ఆరు వికెట్లను నేలకూల్చగా.. ఓపెనర్ ఫర్హాన్ ఒక్కడే పర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ సయీమ్ అయూబ్‌ను హార్దిక్ గోల్డెన్ డకౌట్ చేశాడు. రెండో ఓవర్లో మహ్మద్ హారిస్ (3)ను బుమ్రా అవుట్ చేయడంతో ఆరు పరుగులకే పాక్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో మరో ఓపెనర్ ఫర్హాన్, ఫఖర్ జమాన్ (17) జోడీ ఆదుకునే ప్రయత్నం చేసింది. ఫర్హాన్ భారత బౌలర్లను ఇబ్బంది లేకుండా ఎదుర్కొన్నాడు. కానీ స్పిన్నర్ల రాకతో పాక్ కష్టాలు పెరిగాయి. కాస్త కుదురుకున్న ఫఖర్ జమాన్‌ను అక్షర్ అవుట్ చేయడంతో మూడో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కుల్దీప్ దెబ్బతీయడంతో పాక్ 83 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయింది. వంద పరుగులు కూడా కష్టమే అనిపించింది. అయితే షహీన్ షా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పాక్ 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.
అభిషేక్, సూర్య దంచేశారు
128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు మెరుపు ఆరంభం దక్కింది. ఇన్నింగ్స్ తొలి రెండు బంతులనే ఓపెనర్ అభిషేక్ శర్మ 4,6గా మలిచాడు. అటు గిల్ (10) తర్వాతి ఓవర్లోనే రెండు వరుస ఫోర్లు సాధించినా సయీమ్ అయూబ్ క్యారమ్ బాల్‌కు స్టంపౌట్ అయ్యాడు. ఇక షహీన్ ఓవర్లో అభిషేక్ మరోసారి 4,6తో ధాటిని కనబర్చాడు. తను కూడా సయీమ్ అయూబ్కే చిక్కాడు. అభిషేక్ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులుచేశాడు. ఆ తర్వాత తిలక్ వర్మతో కలిసి కెప్టెన్ సూర్య లాంఛనం పూర్తి చేశాడు. సూర్య 37 బంతుల్లో 47, తిలక్ వర్మ 31 బంతుల్లో 31 పరుగులు చేసి భారత్‌కు సునాయస విజయాన్ని అందించారు.
పాకిస్థాన్‌పై సాధించిన విజయాన్ని భారత సాయుధ బలగాలకు అంకితం చేస్తున్నట్లు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. పహల్గామ్ ఉగ్రదాడిలో అసువులు బాసిన బాధితుల కుటుంబాలకు తాము అండగా ఉంటామని, వారికి ఈ విజయంతో తమ సంఘీభావాన్నితెలియజేస్తున్నామని సూర్యకుమార్ పేర్కొన్నాడు.