ASIA GAMES: భారత్ స్వర్ణ సంబరం
పసిడి మోత మోగించిన భారత మహిళల క్రికెట్ జట్టు... షూటింగ్‌లోనూ స్వర్ణం...;
ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 19 పరుగుల తేడాతో విజయం సాధించి పసిడి పతకం సొంతం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ ప్రీత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. స్మృతీ మంధాన 46 , జెమీమా రోడ్రిగ్స్ 42 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు తప్ప మిగతా వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులకే పరిమితమైంది. హాసిని పెరేరా 25, నీలాక్షి డీ సిల్వా 23 పరుగులు మినహా...మిగతా బ్యాటర్లు స్పల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో టిటాస్ సాధు 3 , రాజేశ్వరీ గైక్వాడ్ 2 వికెట్లు తీయగా పూజా, దీప్తి, దేవిక తలో వికెట్ పడగొట్టారు.
ఈసారి ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ జట్టు రెండే మ్యాచ్‌లు ఆడి, స్వర్ణ పతకం సాధించింది. టాప్ సీడ్ కావడంతో భారత్ నేరుగా క్వార్టర్స్ ఆడే అవకాశం దక్కించుకుంది. మలేసియాతో జరిగిన ఈ మ్యాచ్ మధ్యలో వర్షం వల్ల రద్దయింది. అయినప్పటికీ టాప్ సీడ్ కావడంతో భారత్ సెమీస్‌కు అర్హత సాధించింది. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్.. ఫైనల్లో లంకకు చెక్ పెట్టి పసిడి నెగ్గింది. మరోవైపు బంగ్లాదేశ్ కాంస్యం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. భారత జట్టులో తెలుగమ్మాయి అనూష కూడా ఉంది.
ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేసి క్రికెట్‌లో భారత్‌కు స్వర్ణాన్ని అందించిన భారత మహిళల జట్టుకు అభినందనలు వెల్లువెత్తాయి. ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతమైన పీల్డింగ్‌తో ఆకట్టుకుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపారు. టిటాస్ సాధు మెరుపు బౌలింగ్ వల్ల శ్రీలంకపై భారత్ విజయం సాధించిందని బీసీసీఐ సెక్రటరీ జై షా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. చారిత్రాత్మక విజయంతో స్వర్ణం తెచ్చిన జట్టుకు, సహాయక సిబ్బందికి అభినందనలు తెలిపారు.
మరోవైపు ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో భారత బృందం స్వర్ణ పతకం సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. రుద్రాంక్ష్ పాటిల్, దివ్యాన్ష్, తోమర్‌తో కూడిన బృందం క్వాలిఫికేషన్ రౌండ్‌లో 1893.7 స్కోర్ నమోదు చేసింది. గతనెలలో అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చైనా బృందం నమోదుచేసిన 1893.3 స్కోర్‌ను భారత పురుషుల జట్టు. అధిగమించింది. ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించాడు. పది మీటర్ల ఎయిట్ షూటర్స్ విభాగం ఫైనల్లో తోమర్, రుద్రాంక్ష్ పాటిల్ పసిడి కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. రుద్రాంక్ష్ 4వ స్థానంలో నిలవగా.... తోమర్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీం విభాగంలోనూ భారత బృందం కాంస్యం సాధించింది.