వెస్టిండీస్ పేసర్ల బౌలింగ్ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్స్ విలవిలాడారు. బ్రిడ్జి టౌన్ లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేపట్టిన తొలి రోజు ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం విండీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 57 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. విండీస్ బౌలర్ షమార్ జోసెఫ్ పేస్‌తో చెలరేగి ఆసీస్ టాపార్డర్‌ను పెవిలియన్‌కు పంపించాడు. నాలుగు వికెట్లు తీసిన జోసెఫ్, మునుపటి ఏడు వికెట్ల డెబ్యూ స్పెల్‌ను మళ్లీ గుర్తు చేశాడు. మొత్తం 16 ఓవర్లలో 46 పరుగులకే 4 వికెట్లు సాధించాడు. మరోవైపు జైడెన్ సీల్స్ 5 వికెట్లను తీసి ఆస్ట్రేలియా పతనానికి కారకుడయ్యాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో ఖవాజా 47, ట్రావిస్ హెడ్ 59 మినహా మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరు చేయలేక పోయారు.
చివర్లో కమిన్స్ 18 బంతుల్లో 28 పరుగులు చేయడంతో ఆసీస్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. ఇక విండీస్ బ్యాటింగ్ మొదలైన వెంటనే ఆసీస్ పేసర్లు దాడికి దిగారు. స్టార్క్, ప్యాట్ కమిన్స్, హేజల్ వుడ్ లు దెబ్బకు ప్రత్యర్థులు కూడా పెవిలియన్ బాట పట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 57/4 వద్ద నిలిచింది. విండీస్ 22 సంవత్సరాల తర్వాత తమ గడ్డపై ఆసీస్‌పై టెస్ట్ గెలుపు కోసం ఎదురుచూస్తోంది.