ఆసియా కప్ 2025 ప్రారంభమైన తొలి రోజే భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ)కి ఊహించని షాక్ తగిలింది. ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్(సీఏయూ)లో జరిగినట్లు ఆరోపించబడుతున్న రూ.12 కోట్ల కుంభంకోణంపై విచారణ జరిపించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు బీసీసీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ కుంభకోణంలో రూ.35 లక్షలు కేవలం అరటిపండ్లపై ఖర్చు చేశారనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.
అసలేం జరిగింది?
ఉత్తరాఖండ్‌కు చెందిన సంజయ్ రావత్ అనే వ్యక్తి హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్లో ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్(సీఏయూ) ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించాడు. ఆటగాళ్ల అభివృద్ధి, క్రికెట్ నిర్వహణ కోసం కేటాయించిన రూ.12 కోట్లను అక్రమంగా ఖర్చు చేశారని పేర్కొన్నాడు. ఆటగాళ్లకు ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదని కూడా సంజయ్ రావత్ ఆరోపించాడు. పిటిషనర్ సంజయ్ రావత్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఆటగాళ్ల కోసం కేటాయించిన రూ.12 కోట్ల ప్రభుత్వ నిధులను సీఏయూ దుర్వినియోగం చేసిందని పిటిషనర్ ఆరోపణలు చేశాడు. సీఏయూ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం.. ఆటగాళ్లకు రూ.35 లక్షల విలువైన అరటిపండ్లు తినిపించినట్లు పేర్కొన్నాడు. ఈ ఆరోపణ ఇప్పుడు 'బనానా స్కామ్'గా ప్రచారంలో ఉంది.ఆహారం, క్యాంపుల పేరుతో కోట్లాది రూపాయల ఖర్చు చూపించినప్పటికీ, వాస్తవంగా అంత ఖర్చు చేయలేదని ఆరోపించాడు. అసోసియేషన్ తమ సొంత చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా కాకుండా, బయటి సీఏ ద్వారా ఆడిట్ చేయించుకుందని, దీని ద్వారా అక్రమాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని పిటిషనర్ ఆరోపించాడు. పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ ధర్మాసనం.. బనానా స్కామ్‌పై స్పష్టత ఇవ్వాలని బీసీసీఐకి నోటీసులు జారీ చేసింది. ఇది క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది.