IPL: ధోనీ స్థానంలో యువ వికెట్ కీపర్..!

ధోనీ స్థానంలో బరోడా వికెట్ కీపర్;

Update: 2025-05-02 09:30 GMT

ఐపీఎల్లో ధోనీ శకం ముగిసినట్లే కనిపిస్తోంది. ధోనీ రిటైర్మెంట్ తీసుకోవడం మంచిందంటూ ఇప్పటికే మాజీలు గళం విప్పుతున్న వేళ ధోనీ కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ధోనీకి ఈ ఐపీఎల్ సీజనే చివరిదని.. ధోనీ ఇక మ్యాచులు ఆడబోడంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా వ్యాఖ్యాత డానీ మోరిసన్ ధోనీని ఉద్దేశించి కీలక ప్రశ్న అడిగాడు. టాస్ ఓడిన తర్వాత ధోనీతో మోరిసన్ మాట్లాడుతుండగా.. మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులు గట్టిగా అరిచారు. దాంతో మోరిసన్.. వచ్చే సీజన్ కూడా ధోనీ ఆడాలని వారు కోరుకుంటున్నారని చెప్పాడు. దానికి ధోనీ బదులిస్తూ.. 'నేనసలు తర్వాతి మ్యాచ్‌లో ఆడుతానో లేదో తెలియట్లేదు'అని నవ్వుతూ చెప్పాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఐపీఎల్‌కు వీడ్కోలు పలికేందుకు ధోనీ సిద్దమయ్యాడన్న చర్చ కూడా ఊపందుకుంది. ఈ సీజన్‌లో ధోనీ మొకాలి నొప్పితో బాధపడుతూనే జట్టులో కొనసాగుతున్నాడు. ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై తప్పుకోవడంతో.. జట్టు నుంచి ధోనీ తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ధోనీ ప్లేసులో బరోడా కీపర్

ధోనీ బ్యాటింగ్ లో ఎలా ఉన్నా కీపింగ్ లో మాత్రం ఇంకా అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లోనూ మెరుపు స్టంపింగ్ లతో క్రికెట్ ప్రపంచాన్ని విస్మయపరిచాడు. అయితే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తే అతని స్థానంలో కీపర్ గా చెన్నై ఎవరిని తీసుకుంటుందన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ఇప్పటికే ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం సీఎస్‌కే వేట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. బరోడా ప్లేయర్ ఉర్విల్ పటేల్‌ను సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ట్రయల్స్‌కు ఆహ్వానించినట్లు మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తెలిపాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉర్విల్ పటేల్ 28 బంతుల్లోనే సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఎంపికైన అతనికి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కలేదు. 

Tags:    

Similar News