bcci: ఆర్‌టీఐ నుంచి తప్పించుకొన్న బీసీసీఐ
బీసీసీఐకి భారీ ఊరట... కొత్త క్రీడా బిల్లులో ప్రత్యేక సవరణలు.... జాతీయ క్రీడా బోర్డు గుర్తింపు తప్పనిసరి;
జాతీయ క్రీడా గవర్నెన్స్ బిల్లు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కూడా వర్తించనుంది. ఇది ఇప్పటివరకు స్వతంత్రంగా పనిచేస్తున్న బీసీసీఐకు అధికారిక గుర్తింపు పొందేందుకు, నిర్వహణలో పారదర్శకత, అథ్లెట్-కేంద్రిత సంస్కరణలు, జవాబుదారీతనం వచ్చేలా చేసే ప్రయత్నంగా కేంద్రం పేర్కొంది. బీసీసీఐకు ప్రభుత్వ నిధులు అవసరం లేకపోయినా జాతీయ క్రీడా బోర్డు నుంచి గుర్తింపు పొందాల్సి ఉంటుంది. అయితే, క్రీడా సమాఖ్యల విధులు, ఎన్నికలు, వివాదాలు జాతీయ క్రీడా ట్రిబ్యునల్ పరిధిలో పరిష్కరించాల్సివుంటుంది. అయితే నూతన క్రీడా బిల్లు ద్వారా బీసీసీఐకు భారీ ఊరట లభించింది. క్రీడా మంత్రిత్వశాఖ చేసిన సవరణల ప్రకారం బీసీసీఐ.. సమాచార హక్కు (ఆర్‌టీఐ) పరిధిలోకి రాదు. దీంతో బయట వ్యక్తులు డిమాండ్ చేసే వివరాలను వెల్లడించాల్సిన పనిలేదు. ఈ నెల 23న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్‌సభలో ప్రవేశపెట్టిన జాతీయ క్రీడా పాలన బిల్లులోని క్లాజ్ 15(2) ప్రకారం.. ప్రభుత్వం నుంచి నిధులు, సదుపాయాలు అందుకొంటున్న జాతీయ క్రీడా సమాఖ్యలు మాత్రమే ఆర్‌టీఐ పరిధిలోకి వస్తాయని స్పష్టంగా ఉంది. అత్యంత ధనిక బోర్డుగా గుర్తింపు పొందిన బీసీసీఐ.. నిధుల కోసం ప్రభుత్వంపై ఏమాత్రం ఆధారపడదు. సొంతంగానే మైదానాలు, మౌలిక వసతులను ఏర్పాటు చేసుకొంటోంది. మిగతా సమాఖ్యల తరహాలోనే భారత బోర్డును సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ కొంతకాలంగా బలంగా వినిపిస్తున్నా.. బీసీసీఐ మాత్రం ససేమిరా అంటోంది. కొత్త క్రీడా బిల్లులో ఈ సవరణ బీసీసీఐకు అనుకూలం కానుంది. బీసీసీఐను సమాచార హక్కు చట్టం (RTI) పరిధిలోకి తీసుకురాకుండా ప్రత్యేకంగా సవరణ చేసింది. సమాచార హక్కు చట్ట పరిమితి కేవలం ప్రభుత్వం నుంచి నిధులు పొందే క్రీడా సంఘాలకే వర్తిస్తుంది. ఇది బీసీసీఐకు పెద్ద ఊరటను ఇచ్చింది.
ప్రభుత్వ నియంత్రణలోకి రాకపోయినా
ఈ బిల్లు ప్రకారం, బీసీసీఐ ప్రభుత్వ నియంత్రణలోకి రాదు. కానీ నియమావళిలు, పారదర్శకత, ఆటగాళ్ల హక్కుల పరిరక్షణ కోసం ఈ బిలులో కీలక మార్పులు చేసింది. జాతీయ క్రీడా బోర్డు ఏర్పాటుకు బిల్లు అవకాశం కల్పించింది. దేశంలోని అన్ని క్రీడా సమాఖ్యల పరిపాలన కోసం ఒక సహాయక వేదికగా పనిచేస్తుంది. క్రీడా సంఘాల మధ్య వివాదాలు, ఎన్నికల సమస్యలు మొదలగు అంశాలు జాతీయ క్రీడా ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరిస్తారు. ఇది ముందుగా న్యాయపరమైన, పారదర్శక పరిష్కారం అందించే విధానం. ఈ చట్టం క్రీడా సంఘాల నిర్వహణ విధానాలలో అవినీతిని తగ్గించి, విజయవంతంగా క్రీడల నిర్వహణకు మద్దతును కల్పిస్తుంది. ఆటగాళ్ల రక్షణ కోసం, పార్టిసిపేషన్, పోటీ నియంత్రణ కోసం, క్రీడాకారులు, కోచ్ల హక్కులను కాపాడే విధానాలను బిల్లులో పొందు పరిచారు. 2028 లో జరుగనున్న ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీల కోణంలో కూడా ఈ బిల్లు కీలక ప్రతిపాదనలు చేసి క్రీడా నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జాతీయ క్రీడా గవర్నెన్స్ బిల్లు భారతదేశంలో క్రీడా పరిపాలనపై అధికారిక, పారదర్శక నియంత్రణను ప్రవేశపెట్టడం, వివాదాలు, అవినీతి తగ్గించడం లక్ష్యంగా పనిచేస్తోంది. ఇంతకుముందు లేకపోయిన విధంగా బీసీసీఐ సహా అన్ని క్రీడా సంఘాల పై సంస్కరణలు చేపట్టవచ్చు.