BGT: బాక్సింగ్ డే టెస్ట్‌.. ముగిసిన తొలి రోజు ఆట

ఆసిస్ టాప్ 4 బ్యాటర్లు అర్ధ సెంచరీలు... మళ్లీ రాణించిన బుమ్రా;

Update: 2024-12-26 09:45 GMT

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్‌ జట్ల మధ్య నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు ఆట ముగిసింది. ఈ సమయానికి ఆస్ట్రేలియా 311/6 పరుగులు చేసింది. స్టీవెన్‌ స్మిత్‌ (68*), కమిన్స్‌ (8*) క్రీజులో ఉన్నారు. సామ్‌ కాన్‌స్టాస్‌ 60, ఖవాజా 57, లబుషేన్‌ 72, అలెక్స్‌ కేరీ 31, మార్ష్‌ 4, హెడ్ 0 పరుగులు చేశారు. అంతకుముందు ఓపెనర్లు సామ్‌ కాన్‌స్టాస్‌ (60), ఉస్మాన్ ఖవాజా (57)తోపాటు మార్నస్ లబుషేన్ (57) అర్ధశతకాలు చేశారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 3.. ఆకాశ్‌ దీప్, సుందర్, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. మెల్‌బోర్న్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆసీస్‌ టాస్‌ నెగ్గగానే బ్యాటింగ్ ఎంచుకుంది. అందుకు తగినట్టుగానే ఆసీస్ ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. మరీ ముఖ్యంగా సామ్ కాన్‌స్టాస్ దూకుడు చూపాడు. మొదటి మూడు ఓవర్లలో ఆచితూచి ఆడిన అతడు.. బుమ్రాను టార్గెట్‌ చేస్తూ షాట్లు కొట్టాడు. ఉస్మాన్‌ ఖవాజాతో కలిసి తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో అరంగేట్రం టెస్టుతోపాటు పిన్నవయస్సులోనే హాఫ్‌ సెంచరీ చేసిన రెండో ఆసీస్‌ బ్యాటర్‌గా నిలిచాడు. సామ్‌ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మార్నస్ లబుషేన్‌ (72)తో కలిసి ఉస్మాన్‌ ఖవాజా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రెండో వికెట్‌కు 65 పరుగులు జోడించాడు. తన హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాక ఖవాజా పెవిలియన్‌కు చేరాడు. ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న స్టీవ్ స్మిత్‌తో కలిసి లబుషేన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మూడో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. బుమ్రానే మళ్లీ ఆపద్బాంధవుడు అయ్యాడు. కీలకమైన ఖవాజా, ట్రావిస్‌ హెడ్ (0), మిచెల్ మార్ష్ (4)ను పెవిలియన్‌కు పంపాడు. కాస్త దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన అలెక్స్ ను ఆకాశ్‌ దీప్ అవుట్ చేశాడు.

కోహ్లీకి ICC భారీ జరిమానా

బాక్సింగ్ డే టెస్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆసీస్ ఆటగాడు సామ్ కాన్‌స్టాస్ మధ్య వివాదం చోటు చేసున్న సంగతి తెలిసిందే. ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో ఓ ఓవర్ పూర్తయ్యాక కాన్‌స్టాన్‌ను కోహ్లి భుజంతో ఢీకొన్నాడు. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్దం జరిగింది. ఈ క్రమంలో కోహ్లిపై ICC చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది.

కోహ్లితో వాగ్వాదం.. స్పందించిన సామ్

బాక్సింగ్‌ డే టెస్టు మొదటి రోజు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో వాగ్వాదంపై ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్‌ కాన్‌స్టాస్ స్పందించాడు. ‘మేమిద్దరం కాస్త భావోద్వేగానికి గురయ్యామని అనుకుంటున్నా. విరాట్ వస్తున్నట్లు నేనూ గమనించలేదు. నా గ్లవ్స్‌ను సరిచేసుకొనే పనిలో ఉన్నా. అయితే, క్రికెట్‌లో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇదేమీ పెద్ద సమస్య కాదని భావిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News