SURYAVAMSHI: వైభవ్‌కు బిహార్ ప్రభుత్వం నజరానా

రూ. 10 లక్షల నజరానా ప్రకటించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్;

Update: 2025-04-30 03:30 GMT

ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బిహార్ ప్రభుత్వం నగదు బహుమతి ప్రకటించింది. గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే సెంచరీ చేసి హిస్టరీ క్రియేట్ చేసిన వైభవ్‌కు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూ. పది లక్షల నగదు అందజేస్తున్నట్లు ప్రకటించారు. వైభవ్ సూర్యవంశీ పుట్టిపెరిగింది బిహార్‌లో కావడంతో తమ రాష్ట్ర ఆటగాడిని ప్రోత్సహించేందుకు బిహార్ ప్రభుత్వం ఈ నజరానా ప్రకటించింది. గుజరాత్‌పై వైభవ్ ఏడు ఫోర్లు, పదకొండు సిక్సర్లతో వంద పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి సెన్సేషన్ సృష్టించాడు. ఇప్పుడు 35 బంతుల్లో సెంచరీ బాది యావత్ క్రికెట్ ప్రపంచానికే తన పేరు వినిపించేలా చేశాడు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే వైభవ్ సూర్యవంశీ ఎంతో గొప్ప పేరు సాధించాడు. దాంతో బిహార్ సీఎం నితీష్ కుమార్ వైభవ్‌కు నగదు బహుమతి ప్రకటించాడు.

ఆసక్తికర విషయాలు చెప్పిన చిన్ననాటి కోచ్

వైభవ్ సూర్యవంశీ గురించి... చిన్ననాటి కోచ్ మనీష్ ఓజా ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. బ్రియాన్ లారాకు వీరాభిమాని అయిన వైభవ్ సూర్యవంశీలో నమ్మశక్యం కాని సిక్స్ హిట్టింగ్ ప్రతిభ ఉందని తెలిపాడు. వైభవ్ ప్రతిభ ముందు ఈ శతకం చాలా చిన్నదని.. అతను పదేళ్ల వయస్సులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు బాదే వాడని.. రోజూ నెట్స్ లో 350 నుంచి 400 బంతులు ఎదుర్కొనేవాడని మనీష్ ఓజా వెల్లడించాడు. వైభవ్ సూర్యవంశీకి శిక్షణ ఇస్తున్న సమయంలో ఒక్కసారి కూడా తిట్టాల్సిన అవసరం రాలేదని అన్నాడు. అతడికి ఏ షాట్ నేర్పించినా, ఏ టెక్నిక్ ను వివరించినా దాన్ని పునరావృతం చేయాల్సిన అవసరం రాలేదని చెప్పాడు. **ప్రస్తుతం వైభవ్.. బీహార్‌, తాజ్‌పూర్‌లోని డాక్టర్ ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. క్రికెట్ కారణంగా అతను తన చదవుపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. క్రికెట్ టోర్నీలు లేని సమయంలో మాత్రమే స్కూల్‌కు వెళ్తున్నాడు. అయితే చదువు, ఆటను వైభవ్ బ్యాలెన్స్ చేస్తున్నాడని అతని చిన్ననాటి కోచ్ బ్రజేష్ తెలిపారు. వైభవ్ తన సెంచరీతో ఎన్నో రికార్డులను సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా, అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా అతను నిలిచాడు.

సూర్యవంశీ తండ్రి భావోద్వేగం

వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో సాధించడంపై అతడి తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ ఆనందం వ్యక్తం చేశాడు. ‘నా కొడుకు మా ఊరికి, బిహార్‌ రాష్ట్రానికి, యావత్‌ భారతానికీ  గర్వకారణంగా నిలిచాడు. మూడు, నాలుగు నెలలుగా వైభవ్‌ సూర్యవంశీని తీర్చిదిద్దుతున్న రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యానికి, టీమ్‌కు నేను కృతజ్ఞతలు చెబుతున్నా. నా కుమారుడి ఆటను మరింతగా మార్చిన రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, సపోర్టింగ్‌ స్టాఫ్‌నకు నేను ఎంతో రుణపడి ఉన్నా. వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. వీరి కృషి వల్లే వైభవ్‌ ఈ సెంచరీ సాధించగలిగాడు’ అని సంజీవ్‌ సూర్యవంశీ బిహార్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ విడుదల చేసిన వీడియోలో భావోద్వేగానికి గురయ్యాడు.

Tags:    

Similar News