BRS: కరిగిపోతున్న బీఆర్ఎస్ ప్రతిపక్ష కాలం
బీఆర్ఎస్ శ్రేణుల్లో సాగుతున్న సందిగ్ధత... చర్చ అంతా కేసులు, విచారణ చుట్టే
ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత ఒక రాజకీయ పార్టీ ప్రధానంగా చేయాల్సింది ప్రజల మధ్య ఉండటం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపటం, వచ్చే ఎన్నికల కోసం సంస్థాగతంగా బలోపేతం కావటం. కానీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. గత కొద్ది కాలంగా పార్టీ కాలం మొత్తం కేసులు, నోటీసులు, విచారణల చుట్టూనే తిరుగుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తోంది. ఒక రోజు కాళేశ్వరం పేరు, మరో రోజు ఫార్ములా రేస్ వ్యవహారం, ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంశం… ఇలా ప్రతిరోజూ బీఆర్ఎస్ చుట్టూ ఏదో ఒక కేసు లేదా విచారణ వార్తే ప్రధాన చర్చగా మారుతోంది. ప్రజాసమస్యలపై గళమెత్తాల్సిన ప్రతిపక్షం, తన అగ్రనేతలు కేసులలో చిక్కుకున్నారా? నోటీసులు వచ్చాయా? విచారణకు పిలిచారా? అన్న ప్రశ్నల మధ్యే రోజులు గడుపుతోందన్న విమర్శలు పెరుగుతున్నాయి.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలపై వరుసగా విచారణలు ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం కమిషన్ విచారణ, ఫార్ములా కార్ రేస్ నిర్వహణలో నిధుల వినియోగంపై ప్రశ్నలు, ట్యాపింగ్ ఆరోపణలు – ఇవన్నీ కలిసి పార్టీ అగ్రనేతలను నిరంతరం వివరణలు ఇవ్వాల్సిన పరిస్థితిలోకి నెట్టేశాయి.
ఒక కేసు ముగిసేలోపు...
ఒక కేసు ముగిసేలోపు మరో అంశం తెరపైకి రావడం పార్టీ శ్రేణుల్లో ఆందోళనను పెంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక స్థాయిలోనూ ఇదే పరిస్థితి. జిల్లా, మండల స్థాయి నాయకులపై కూడా కేసులు నమోదు కావడం, విచారణలకు పిలవడం జరుగుతూనే ఉంది. దీని వల్ల పార్టీ కేడర్‌లో భయం, అసంతృప్తి పెరుగుతోందన్న అభిప్రాయం ఉంది. “ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి” అంటూ కొందరు కార్యకర్తలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని కేసులు, నోటీసులు ఉన్నా పెద్దగా అరెస్టులు జరగలేదు. ఒకవైపు అరెస్టులు చేయకుండా, మరోవైపు విచారణలు, నోటీసులతోనే నాయకులను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. “అరెస్టు చేస్తేనే విషయం స్పష్టమవుతుంది, లేకపోతే సస్పెన్స్‌లో ఉంచడమే రాజకీయ వ్యూహం” అంటూ అధికార పార్టీ నేతలు వాదిస్తుంటే, ప్రతిపక్ష వర్గాలు మాత్రం దీన్ని “మానసిక వేధింపుల రాజకీయంగా” అభివర్ణిస్తున్నాయి. . రాబోయే రోజుల్లో అయినా కేసుల ప్రచారాన్ని దాటుకుని ప్రజల మధ్యకి వెళ్లగలిగితేనే ప్రతిపక్ష పాత్రకు న్యాయం చేసినట్లవుతుందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవైపు చట్టం తన పని తాను చేస్తుందా? మరోవైపు రాజకీయ పోరు మరింత ఉధృతమవుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే తేలనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు… ఇప్పుడు కేవలం ఒక కేసు కాదు. అది తెలంగాణ రాజకీయాల భవిష్యత్తును ప్రభావితం చేసే కేంద్ర బిందువుగా మారుతోంది.