BUMRAH: చరిత్ర సృష్టించిన బుమ్రా.. 93 ఏళ్లల్లో ఒకే ఒక్కడు
మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఇండియన్ పేసర్
రెండో టెస్ట్‌తో జస్ప్రీత్ బుమ్రా ఓ ఫీట్ సాధించాడు. 93 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలోనే మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఇండియన్ పేసర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ తో జరిగే రెండో టెస్టు బుమ్రాకు 50వ టెస్ట్ మ్యాచ్. బుమ్రా ఇప్పటి వరకు 75 టీ20లు, 89 వన్డేలు, 50 టెస్ట్‌లు ఆడాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఏడో టీమిండియా ప్లేయర్ గా బుమ్రా నిలిచాడు. మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్‌లు బుమ్రా కన్నా ముందున్నారు. టెస్ట్‌ల్లో ఏడుగురు భారత పేసర్లు మాత్రమే 50 ప్లస్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. ఈ జాబితాలో 131 మ్యాచ్‌లతో కపిల్ దేవ్ అగ్రస్థానంలో ఉండగా.. ఇషాంత్ శర్మ(105), జహీర్ ఖాన్(92), మహమ్మద్ షమీ(64), జవగళ్ శ్రీనాధ్(67), ఉమేశ్ యాదవ్(57) జస్ప్రీత్ బుమ్రా కంటే ముందున్నారు. ఇప్పటి వరకు బుమ్రా 93 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 222 వికెట్లు తీసాడు. 15 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌లో సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గిల్ టాస్ గెలవడం ఇదే తొలిసారి. వరుసగా గత 6 మ్యాచ్‌ల్లో గిల్ టాస్ ఓడాడు. ఇంగ్లండ్ పర్యటనతో కెప్టెన్సీ కెరీర్ ప్రారంభించిన గిల్.. అక్కడ ఐదు మ్యాచ్‌లకు ఐదింటిలోనూ టాస్ ఓడిపోయాడు. వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లోనూ టాస్ గెలవలేకపోయాడు. టాస్ గెలిచి పరాజయాల పరంపరకు బ్రేక్ వేసాడు.