IPL: ముంబైపై చెన్నై ఘన విజయం

తొలి మ్యాచ్ ఓటమి సంప్రాదాయాన్ని కొనసాగించిన ముంబై... ఆకట్టుకున్న మిస్టరీ స్పిన్నర్ నూర్;

Update: 2025-03-24 02:00 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన చెన్నై 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. గైక్వాడ్ (53), రచిన్ రవీంద్ర(65*) అర్ధ సెంచరీలతో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకు ఏదీ కలిసి రాలేదు. తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. తిలక్‌ వర్మ (31), సూర్యకుమార్‌ యాదవ్‌ (29), దీపక్‌ చాహర్‌ (28) మిచెల్‌ శాట్నర్‌ (11), నామ్‌ ధిర్‌ (17) రన్స్ చేశారు. ఇటు, నూర్‌ అహ్మద్‌ 4 వికెట్లు, ఖలీల్‌ అహ్మద్‌ 3 వికెట్లు తీశారు.

తిప్పేసిన నూర్

మిస్టరీ స్పిన్నర్‌ నూర్‌.. ముంబై ఇండియన్స్‌ను తిప్పేశాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైను ఖలీల్‌ వణికించాడు. తన వరుస ఓవర్లలో ఓపెనర్లు రోహిత్‌ శర్మ (0), ర్యాన్‌ రికెల్టన్‌ (13)ను పెవిలియన్‌ చేర్చాడు. విల్‌ జాక్స్‌ (11)ను అశ్విన్‌ అవుట్ చేయడంతో పవర్‌ప్లేలోనే ముంబై మూడు టాపార్డర్‌ వికెట్లు చేజార్చుకుంది. 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ నాలుగో వికెట్‌కు కెప్టెన్‌ సూర్య, తిలక్‌.. 51 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. క్రీజులో కుదురుకున్న బ్యాటర్లను అవుట్‌ చేసిన నూర్.. ముంబైను గట్టిదెబ్బ కొట్టాడు. 11వ ఓవర్‌లో నూర్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను ధోనీ మెరుపు స్టంపింగ్ చేశాడు. నమన్‌ ధిర్‌ (17)ను కూడా నూర్‌ బౌల్డ్‌ చేయడంతో ముంబై కనీసం పోరాడగలిగే స్కోరైనా చేస్తుందా? అనే అనుమానం కలిగింది. చివర్లో బ్యాట్‌ను ఝుళిపించిన దీపక్‌ జట్టు స్కోరును 150 మార్క్‌ దాటించాడు.

రచిన్‌- గైక్వాడ్‌ జోరు

ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి (2)ని దీపక్‌ రెండో ఓవర్‌లోనే అవుట్‌ చేశాడు. కానీ, మరో ఓపెనర్‌ రచిన్‌కు జత కలసిన కెప్టెన్‌ రుతురాజ్‌ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రుతురాజ్ గైక్వాడ్‌ అర్ధ శతకం పూర్తి చేసుకొన్నాడు. అయితే మధ్యలో విఘ్నేష్‌ మధ్య ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి చెన్నైకు షాక్ ఇచ్చాడు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన శివం దూబే (9), దీపక్‌ హుడా (3)ను కూడా అవుట్‌ చేసిన విఘ్నేష్‌.. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. రచిన్‌కు జత కలసిన జడేజా (17) ఆరో వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు ముంగిట నిలబెట్టాడు. విఘ్నేష్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకొన్న రచిన్‌.. మరో భారీ షాట్‌ ఆడి చెన్నైకు తొలి విజయాన్ని అందించాడు.

Tags:    

Similar News