CRICKET: రిటైర్మెంట్ ప్రకటిస్తే రూ.58 కోట్లు
ఆస్ట్రేలియా క్రికెటర్లకు బంపర్ ఆఫర్... హెడ్, కమిన్స్‌కు ఐపీఎల్ ప్రాంఛైజీ ఆఫర్.. చెరో రూ. 58 కోట్లు ఇస్తామంటూ చర్చలు
టీ20ల రాకతో క్రికెట్ స్వరూపమే మారిపోయింది. పొట్టి ఫార్మాట్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుండడంతో ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. జాతీయ జట్టకు ప్రాతినిధ్యం వహిస్తే వచ్చే నగదుతో పోలిస్తే ఫ్రాంఛైజీ క్రికెట్లోనే ఆటగాళ్లు చాలా ఎక్కువ మొత్తాలనే అందుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసి ఏడాది పొడువునా టీ20 లీగులు ఆడుతూ భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నారు. నికోలస్ పూరన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి ఆటగాళ్లు ఈ కోవకే చెందుతారు. దీనిపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ వార్త క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్లకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. సంవత్సరానికి ఒక్కొక్కరికి 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 58 కోట్లు) ఆఫర్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ మొత్తాన్ని పొందాలంటే ఆ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాల్సి ఉంటుంది. వారిద్దరు ఐపీఎల్లో మాత్రమే కాకుండా తమ ఫ్రాంఛైజీకి చెందిన జట్ల తరుపున ఇతర లీగుల్లోనూ ఆడాల్సి ఉంటుందట. అయితే.. దీనిపై ప్రస్తుతానికి కమిన్స్, హెడ్లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే వీరిద్దరూ ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు సమాచారం.
గిట్టుబాటే కానీ..
రూ.58 కోట్లను అందుకోవాలంటే కమిన్స్, హెడ్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి కేవలం తమ లీగ్ లోనే ఆడాలని ఆ ఐపీఎల్ ప్రాంఛైజీ షరత్తు విధించింది. ఆస్ట్రేలియా క్రికెట్ నుంచి వీరిద్దరూ బయటకు రావాల్సి ఉంటుంది. కేవలం ఐపీఎల్లో మాత్రమే కాకుండా.. తమ ఫ్రాంచైజీకి చెందిన జట్ల తరఫున ఇతర టీ20 లీగుల్లోనూ ఆడాల్సిఉంది. జాతీయ జట్టు తరఫున ఆడకుండా.. ఫ్రాంచైజీకి వస్తున్నందుకే ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏడాది పొడవునా లీగులు ఉండటంతో ఫ్రాంచైజీకీ ఆ ధర బాగానే వర్కౌట్ అవుతుందనేది క్రికెట్ వర్గాల అంచనా.
తిరస్కరించిన హెడ్, కమిన్స్ ?
ఈ ఆఫర్‌ను కమిన్స్, హెడ్ ఇద్దరూ తిరస్కరించారని తెలుస్తోంది. దేశం కంటే తమకు డబ్బు ముఖ్యం కాదని సదరు ఫ్రాంచైజీ యాజమాన్యానికి తేల్చి చెప్పారట. ఈ విషయాన్ని ఆసీస్ మీడియా కొన్ని రోజులుగా హైలైట్ చేస్తుంది. సోషల్‌మీడియాలో సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. దేశం పట్ల కమిన్స్, హెడ్‌కు ఉన్న అంకితభావాన్ని కొనియాడుతున్నారు. సాధారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దేశం తరఫున ఆడితే ఏడాదికి 1.5 మిలియన్ డాలర్లకు మించి రావు. అలాంటిది కమిన్స్, హెడ్ ఇంత భారీ ఆఫర్‌ను ఎలా కాదనుకున్నారని కొందరనుకుంటున్నారు.