MCC: క్రికెట్ నిబంధనల్లో ఏకంగా 73 మార్పులు
క్రికెట్ నిబంధనల్లో ఎంసీసీ భారీ మార్పులు... మరింత ఆకర్షణీయంగా ఎంసీసీ నిబంధనలు... ఏకంగా 73 మార్పులు తీసుకొచ్చిన ఎంసీసీ
ఆధునిక క్రికెట్ వేగంగా మారుతున్న నేపథ్యంలో ఆటను మరింత ఉత్కంఠభరితంగా, స్పష్టంగా మార్చే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ప్రపంచ క్రికెట్‌కు నియమ నిబంధనలు రూపొందించే ప్రతిష్టాత్మక సంస్థ మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) క్రికెట్ చట్టాల్లో విస్తృత స్థాయిలో మార్పులు ప్రతిపాదించింది. మొత్తం 73 అంశాల్లో సవరణలు సూచిస్తూ, కాలానుగుణంగా ఆట స్వరూపం మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు ఈ ఏడాది అక్టోబరు నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. క్రికెట్లో ఉత్కంఠను పెంచడం, ఆటలోని అనవసర ఆలస్యాలను తగ్గించడం, అలాగే నియమాల అమలులో పారదర్శకత తీసుకురావడమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యమని ఎంసీసీ పేర్కొంది. గత కొన్నేళ్లుగా క్రికెట్ అభిమానులు, ఆటగాళ్లు, అంపైర్ల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులు రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్లలో ఆట సాగే విధానంలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
టెస్టు, ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు అమలులో ఉన్న ఓ సంప్రదాయానికి ఎంసీసీ ముగింపు పలికింది. ఆఖరి ఓవర్లో వికెట్ పడితే, ఆ రోజు ఆటను అక్కడితో నిలిపివేయడం సాధారణంగా జరుగుతూ వచ్చింది. వికెట్ పడిన వెంటనే కొత్త బ్యాటర్ క్రీజులోకి రాకపోవడం వల్ల ఆటలో ఉత్కంఠ తగ్గిపోతుందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై ఆఖరి ఓవర్లో వికెట్ పడినా మిగిలిన బంతులు తప్పనిసరిగా వేయాలనే నిర్ణయానికి ఎంసీసీ వచ్చింది. దీనివల్ల ఆట చివరి క్షణాల వరకు అభిమానులకు ఆసక్తి కొనసాగుతుందని భావిస్తోంది. మహిళల క్రికెట్, జూనియర్ క్రికెట్‌కు సంబంధించి కూడా ఎంసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటివరకు బంతుల పరిమాణాల విషయంలో స్పష్టత లేకపోవడంతో, వివిధ దేశాల్లో భిన్నమైన ప్రమాణాలు అమలులో ఉండేవి.
ఈ గందరగోళాన్ని తొలగించేందుకు బంతుల పరిమాణాలను మళ్లీ నిర్వచించింది. వీటిని సైజ్ 1, సైజ్ 2, సైజ్ 3గా వర్గీకరించింది. పురుషుల క్రికెట్లో ఉపయోగించే సైజ్ 1 బంతిలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే మహిళలు, జూనియర్ క్రికెటర్ల కోసం ఉపయోగించే బంతుల నాణ్యత, ప్రమాణాలు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంది. క్రికెట్ సామగ్రి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాట్ల విషయంలోనూ కీలక సడలింపులు ప్రకటించింది. ఒకే చెక్క ముక్కతో తయారయ్యే సాంప్రదాయ విల్లో బ్యాట్ల ధరలు భారీగా పెరగడం వల్ల, ముఖ్యంగా యువ క్రికెటర్లు ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ చెక్క ముక్కలను అతికించి తయారుచేసే ‘ల్యామినేటెడ్ బ్యాట్ల’ వాడకానికి అనుమతి ఇచ్చింది. దీని ద్వారా దేశవాళీ, క్లబ్ స్థాయిలో ఆడే ఆటగాళ్లకు ఖర్చు తగ్గుతుందని ఎంసీసీ అభిప్రాయపడుతోంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఇప్పటిలాగే సింగిల్ విల్లో బ్యాట్లే కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
వికెట్‌కీపింగ్ నిబంధనల్లోనూ కొంత వెసులుబాటు కల్పించింది. బౌలర్ రన్అప్ ప్రారంభించిన సమయంలో వికెట్‌కీపర్ గ్లోవ్స్ స్టంప్స్ కంటే ముందుకు వచ్చినా ఇకపై జరిమానా విధించబోమని ప్రకటించింది. అయితే బౌలర్ బంతిని విడిచే సమయంలో మాత్రం కీపర్ పూర్తిగా స్టంప్స్ వెనుకే ఉండాలనే నిబంధనను కొనసాగించింది. ఈ మార్పుతో ఆట వేగం పెరుగుతుందని, అనవసర వివాదాలు తగ్గుతాయని అంపైర్లు భావిస్తున్నారు. ఎంసీసీ ప్రతిపాదించిన ఈ 73 మార్పులు క్రికెట్ ఆటను మరింత ఆధునికంగా మార్చే దిశగా కీలకంగా మారనున్నాయి.