CT2025: అద్భుతం చేసిన అఫ్గాన్

ఇంగ్లాండ్‌పై చిరస్మరణీయ విజయం... అద్భుత శతకంతో మెరిసిన జద్రాన్;

Update: 2025-02-27 01:30 GMT

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్ అద్భుతం చేసింది. అద్భుత ఆటతీరుతో ఇంగ్లాండ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. గతంలో కీలక మ్యాచ్‌లలో పెద్ద టీమ్స్‌కు షాకిచ్చిన ఆఫ్గానిస్తాన్.. మరోసారి దాన్ని పునరావృతం చేసింది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి ఇంటికి సాగనంపింది. బ్యాటింగ్‌లో ఇబ్రహీం సెంచరీతో చెలరేగిపోగా.. బౌలింగ్‌లో కాస్త తడబడినా నిలబడింది. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో భయపెట్టినా.. ఆఫ్గాన్ బౌలర్లు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడారు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆఫ్గాన్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. సెంచరీ కొట్టిన ఇబ్రహీంకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఇబ్రహీం జద్రాన్ సూపర్ సెంచరీ

ఈ మ్యాచులో ఇంగ్లాండ్‌పై అఫ్గానిస్థాన్‌ సంచలన విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్‌ (177) సెంచరీ బాదడంతో భారీ స్కోరు చేయగలిగింది. బ్యాటింగ్‌లో ఇబ్రహీం 177 పరుగులు(12 ఫోర్లు, 6 సిక్సర్లు) చేయగా.. షాహిదీ 41, ఒమర్జాయ్ 40, నబీ 40* రన్స్‌తో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చర్ 3, లివింగ్ స్టోన్ఓ 2, వర్టన్, రషీద్ తలో వికెట్ తీశారు. 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్గాండ్ జట్టు.. 49.5 ఓవర్లలో 317 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రూట్ మాత్రమే 120 రన్స్‌తో రాణించాడు. దీంతో టోర్నీ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ క్రికెటర్‌ ఇబ్రహీం జద్రాన్‌ సెంచరీతో చెలరేగాడు. 146 బంతుల్లో 177 పరుగుల చేసి టోర్నీ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు 165 పరుగులతో ఇంగ్లండ్‌కి చెందిన బెన్‌ డకెట్‌ పేరిట ఉండేది. డకెట్‌ ఇటీవల ఆస్ట్రేలియా మీద ఈ స్కోరు సాధించిన విషయం తెలిసిందే.

జద్రాన్ అరుదైన ఘనత

ఈ కీలక సమరంలో అఫ్గానిస్తాన్ యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ సెంచరీతో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన తొలి అఫ్గానిస్తాన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. జద్రాన్ వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీతో మెరిశాడు.

Tags:    

Similar News