chess: విశ్వ విజేత దివ్య దేశ్‌ముఖ్
టై బ్రేకర్‌లో దివ్య విజయం... భారతీయ చెస్‌లో కొత్త తార.. దివ్యపై ప్రశంసల జల్లు;
భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ సంచలనం సృష్టించింది. రెండు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్ లో ఛాంపియన్‌గా అవతరించింది. రెండుసార్లు వరల్డ్ విన్నర్ కోనేరు హంపిని ఓడించి విజేతగా నిలిచిందీ యవకెరటం. జార్జియా వేదికగా జరిగి ఈ మెగా టోర్నీ ఫైనల్లో తొలి రెండు మ్యాచ్‌లను డ్రాగా ముగించారిద్దరూ. దాంతో, ట్రై బ్రేకర్ అనివార్యమైంది. ఈ రౌండ్లో వ్యూహాత్యక ఆటతో హంపిని మట్టికరిపించి టైటిల్ ఎగరేసుకుపోయింది దివ్య. ట్రోఫీతో పాటు రూ.43 లక్షల నగదు బహుమతి గెలుచుకుంది మహరాష్ట్ర ప్లేయర్. రన్నరప్ హంపి రూ.26 లక్షలు అందుకుంది. దివ్య దేశ్‌ముఖ్ వయసు 19 ఏళ్లు. ఈ గెలుపుతో ఫిడే వరల్డ్‌కప్‌తో పాటు ఆమెకు గ్రాండ్‌మాస్టర్ టైటిల్ కూడా వచ్చేసింది. ఫిడే కప్‌ను గెలిచిన ఆనందంలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. హంపితో జరిగిన ఫైనల్ చాలా థ్రిల్లింగ్‌గా సాగింది. హంపిని ఓడించిన దివ్య ఇప్పుడు చెస్ వరల్డ్‌లో సెన్షేషనల్ స్టార్ అయ్యారు. భారతీయ చెస్ క్రీడారంగంలో కొత్త తార అవతరించినట్లు అయ్యింది.
దివ్య రియాక్షన్
విక్టరీ తర్వాత దివ్య మాట్లాడుతూ.. దీన్ని అర్థం చేసుకోవడానికి తనకు టైం పడుతుందని, ఈ విక్టరీ ద్వారా తనకు గ్రాండ్‌మాస్టర్ టైటిల్ రావడం అదృష్టమని, ఈ టోర్నమెంట్‌కు ముందు తనకు ఎటువంటి గుర్తింపు లేదని, ఈ విక్టరీ చాలా విశేషమైందని, మునుముందు ఇంకా ఎంతో సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. గ్రాండ్‌మాస్టర్ టైటిల్ గెలిచిన 88వ భారత చెస్ ప్లేయర్ అయ్యింది దివ్య. విజయానికి దోహదపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు దివ్య విజయనానంతరం ప్రకటించింది.
మొదటి గేమ్ సాగిందిలా...
రెండుసార్లు వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్ హంపి నల్లపావులతో డ్రా చేసుకోవడంతో రెండో గేమ్‌లో ఆమె తెల్లపావులతో ఆడనుంది. ఇది.. 38 ఏళ్ల తెలుగు గ్రాండ్‌మాస్టర్‌కు అనుకూలించనుంది. ఇక..హంపితో మొదటి గేమ్‌లో తెల్లపావులతో క్వీన్స్ గాంబిట్ ఓపెనింగ్‌తో దివ్య పోటీని ప్రారంభించింది. వినూత్నమైన ఎత్తులతో ఆరంభంలో పైచేయి సాధించింది. అయితే క్వీన్, రూక్తో హంపి ఎదురు దాడికి దిగింది. తొలి గంటలో..ఎత్తులు వేసేందుకు 19 ఏళ్ల ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య సుదీర్ఘ సమయం తీసుకుంది. దాంతో సమయభావంతో ఆమె ఒత్తిడికి లోనైంది.. మరోవైపు హంపి ప్రశాంతంగా..వ్యూహాత్మక ఎత్తులతో పట్టుబిగించింది. ఇద్దరూ ఎత్తులకు పైఎత్తులు వేయడంతో మిడిల్ గేమ్కొచ్చే సరికి పోరు రసవత్తరంగా మారింది. ఇక..ఎండ్ గేమ్‌లో అటు హంపి, ఇటు దివ్యకు గెలుపు అవకాశాలు కనిపించాయి. కానీ ఎవరూ రిస్క్ తీసుకొనేందుకు ప్రయత్నించలేదు. దాంతో ఇద్దరూ డ్రాగా ముగించేందుకు మొగ్గు చూపారు. తొలి గేమ్ ను డ్రాగా ముగించిన భారత అమ్మాయిలు కోనేరు హంపి, దివ్య రెండో గేమ్ ను కూడా డ్రా చేశారు. చివరి గేమ్ సాగే కొద్దీ ఫలితం తేలే అవకాశాలు లేకపోవడంతో దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ గేమ్ 41వ ఎత్తు డ్రా అయ్యింది. దీంతో టై బ్రేక్ లో విజేతను ఖరారు చేశారు.