WTC: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా
టీమిండియా ఆశలు గల్లంతు.. ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా భేటీ;
ఆస్ట్రేలియా బోర్డర్-గావస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. సిడ్నీ జరిగిన చివరి టెస్టులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా 3-1 తేడాతో ఐదు టెస్టుల సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. జూన్‌లో దక్షిణాఫ్రికాతో జరగనున్న ఫైనల్‌లో ఆసీస్ తలపడనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ నిష్క్రమించింది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి.
గతంలో ఇలా.,..
2019-21 సైకిల్‌లో టీమిండియా 70 విన్నింగ్ శాతంతో తొట్ట తొలి సీజన్‌లో భారత్ ఫైనల్‌కు ఆర్హత సాధించింది. కానీ విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో కివీస్ చేతిలో ఓటమి చవిచూసింది. 2021-23లో కూడా అద్బుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఫైనల్‌కు క్వాలిఫై అయింది. కానీ డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో మాత్రం తమ ఆధిపత్యాన్ని భారత్ కొనసాగించలేకపోయింది. ఈ సీజన్‌లో 19 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 9 విజయాలు, 8 ఓటములను చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో 50 విన్నింగ్ శాతంతో మూడో స్ధానానికే రోహిత్ సేన పరిమితమైంది.
ఇప్పటికే ఫైనల్లో దక్షిణాఫ్రికా
మరోవైపు దక్షిణాఫ్రికా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టింది. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ప్రోటీస్ ఆర్హత సాధించడం ఇదే తొలిసారి. ఇక జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా అమీతుమీ తెల్చుకోనున్నాయి.