ENG vs IND: విజయానికి ఏడు వికెట్ల దూరంలో...
427 పరుగులకు భారత్ డిక్లేర్... ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల టార్గెట్... 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్;
రెండోటెస్టును కైవసం చేసుకునేందుకు ఇండియా రంగం సిద్ధం చేసుకుంది. ప్రత్యర్థికి భారీ టార్గెట్ ను సెట్ చేసిన టీమిండియా.. ఇప్పటికే మూడు వికెట్లు తీసి, ఐదో రోజు విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో 427/6 స్కోరు చేసి డిక్లేర్ చేసింది భారత జట్టు. దీంతో 608 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్ జట్టు, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. భారత జట్టు విధించిన లక్ష్యానికి ఇంకా 536 పరుగులు వెనకబడి ఉంది ఇంగ్లాండ్.. ఐదో రోజు వర్షం కురిసే అవకాశం ఉండడంతో బౌలర్ల పర్ఫామెన్స్‌పైనే టీమిండియా అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
భారీ స్కోరు చేసిన టీమిండియా
తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269) చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (161; 162 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ చెలరేగాడు. రిషభ్ పంత్ (65; 58 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు అలరించాడు. రవీంద్ర జడేజా (69*; 118 బంతుల్లో), కేఎల్ రాహుల్ (55; 84 బంతుల్లో 10 ఫోర్లు) కూడా అర్ధ శతకాలు బాదారు. వాషింగ్టన్ సుందర్ (12*) పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 2, షోయబ్ బషీర్ 2, బ్రైడన్ కార్స్, రూట్ చెరో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 64/1తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన భారత్ 427/6 వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 180 కలుపుకొని 608 పరుగుల భారీ టార్గెట్‌ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది.
ఆకాశ్ దీప్ హవా..
608 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ను ఆకాశ్ దీప్ వణికించాడు. మంచి యాంగిల్స్ తో బౌలింగ్ చేసి, రెండు కీలక వికెట్లను కొల్లగొట్టాడు. అంతకుముందు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్ పతనానికి నాంది పలికాడు. తన తొలి ఓవర్లోనే ఓపెనర్ జాక్ క్రాలీ ని డకౌట్ చేశాడు. మంచి లెంగ్త్ లో బౌలింగ్ చేయగా, డ్రైవ్ ఆడిన క్రాలీ ఔటయ్యాడు. ఆ తర్వాత ఆకాశ్ దీప్ హవా మొదలైంది. తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే బెన్ డకెట్ (25)ను తనే ఔట్ చేశాడు. ఓవర్ ద వికెట్ బౌలింగ్ చేసి, డకెట్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మరింత చక్కగా బౌలింగ్ చేస్తూ, ప్రమాదకర జో రూట్ (6) ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఒల్లీ పోప్, హేరీ బ్రూక్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. అంతకుమందు ఓవర్ నైట్ స్కోరు 64/1 తో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన టీమిండియా.. గిల్ (161) మరోసారి సెంచరీతో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రెండో భారత ప్లేయర్ గా నిలిచాడు. నేడు ఆటకు చివరి రోజు కావడంతో మిగతా వికెట్లను తీసి, రెండో టెస్టును కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది. అంతకుముందు తొలి టెస్టును ఇంగ్లాండ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.