Tamim Iqbal:బంగ్లా మాజీ కెప్టెన్‌కు గుండెపోటు

మాజీ కెప్టెన్‌ తమీమ్ ఇక్బాల్‌ గుండెపోటు... పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు;

Update: 2025-03-25 02:30 GMT

బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్ తమీమ్‌ ఇక్బాల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో మ్యాచ్‌ ఆడుతుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఫిజీషియన్‌ వెల్లడించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. తమీమ్‌కు యాంజియోప్లాస్టీ చేసినట్లు వైద్యులు చెప్పారు. తమీమ్‌ ప్రాణాపాయ స్థితి నుంచి బయటికి వచ్చాడని... అతనికి గుండెపోటు వచ్చిందని... తాము యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ చేశామని వైద్య బృందం వెల్లడించింది. ప్రస్తుతం అతను అబ్జర్వేషన్‌లో ఉన్నాడని... తమీమ్‌ వేగంగా కోలుకునేందుకు వైద్య బృందం కృషిచేస్తోందని వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే..?

ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా మహమ్మదన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌, షినెపుకర్‌ క్రికెట్‌ క్లబ్‌ల మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో మహమ్మదన్ క్లబ్‌ కెప్టెన్‌గా తమీమ్ ఇక్బాల్ ఉన్నాడు. టాస్ కోసం గ్రౌండ్ లోకి వచ్చినప్పుడే తమీమ్ ఇబ్బందిగా కనిపించాడు. కాసేపటికే ఉన్నట్టుండి ఛాతీలో నొప్పితో బాధపడ్డాడు. దీంతో స్థానికంగా ఉన్న ఫజిలాతున్నెసా ఆసుపత్రికి తరలించి పరీక్షించగా.. స్వల్ప గుండెపోటుగా గుర్తించారు.

వీడ్కోలు పలికినా...

ఈ ఏడాది జనవరిలోనే తమీమ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత నుంచి లీగ్‌ మ్యాచ్‌లు ఆడుతూ కామెంట్రీ చేస్తున్నాడు. 2023లో చివరిసారిగా బంగ్లాదేశ్ నేషనల్ టీంకు ఆడిన తమీమ్... బంగ్లా తరఫున 70 టెస్టులు, 78 టీ20లు ఆడాడు. 243 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడి 8,357 పరుగులు నమోదు చేశాడు. తమీమ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Tags:    

Similar News