AUSTRALIA: పతాకస్థాయి నుంచి పాతాళం వరకు..
టీ 20 ప్రపంచకప్‌లో వరుస ఓటములు... సతమతమవుతున్న ఆస్ట్రేలియా జట్టు
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో ఆస్ట్రేలియా జట్టు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వరుస పరాజయాలతో కంగారూల పరిస్థితి సంక్లిష్టంగా మారింది. సీనియర్ ఆటగాళ్లు దూరమవడం, జట్టులో కీలక సభ్యులు ఫామ్ కోల్పోవడం వంటి కారణాలు ఆసీస్ ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు బలమైన జట్టుగా పేరుగాంచిన ఆస్ట్రేలియా ఇప్పుడు గ్రూప్ దశలోనే నిష్క్రమించే పరిస్థితిని ఎదుర్కొంటోంది. టోర్నీ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టుకు భారీ దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్ ప్రకటించడంతో బౌలింగ్ దళానికి నాయకత్వ లోటు ఏర్పడింది. అంతేకాదు, జట్టులో ప్రధాన బౌలర్లైన పాట్ కమిన్స్, హేజిల్ వుడ్ ఫిట్నెస్ సమస్యలతో టోర్నీకి దూరమయ్యారు. స్క్వాడ్ ప్రకటన చివరి రోజున కమిన్స్ తప్పుకోవడం, ఆ వెంటనే హేజిల్‌వుడ్ కూడా రూల్డ్ అవుట్ కావడం ఆసీస్‌కు పెద్ద షాక్‌గా మారింది. ఈ ముగ్గురు లేకుండా ఆస్ట్రేలియా బౌలింగ్ బలహీనంగా మారింది.
గ్రూప్–బీలో ఆడుతున్న ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి శుభారంభం చేసింది. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు సమన్వయంగా రాణించాయి. దీంతో ఆసీస్ మళ్లీ పాత పుంజాన్ని అందుకుంటుందన్న ఆశలు అభిమానుల్లో కలిగాయి. అయితే ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. తర్వాతి మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్‌కు షాకిచ్చిన జింబాబ్వే మరోసారి అదే సన్నివేశాన్ని పునరావృతం చేసింది. కీలక సమయంలో ఆసీస్ బ్యాటింగ్ విఫలమవడంతో లక్ష్యాన్ని చేధించలేకపోయింది. ఈ ఓటమి జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. డూ ఆర్ డై మ్యాచ్‌గా భావించిన శ్రీలంక పోరులో కూడా ఆసీస్‌కు నిరాశే ఎదురైంది.
ఆస్ట్రేలియా తన చివరి లీగ్ మ్యాచ్‌ను ఒమన్‌తో ఆడనుంది. ఒమన్ పై భారీ విజయం సాధించడం మాత్రమే ఆసీస్‌కు మిగిలిన మార్గం. అయినప్పటికీ, ఇతర జట్ల ఫలితాలపై కూడా వారి భవిష్యత్ ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి 17న జరగనున్న జింబాబ్వే–ఐర్లాండ్ మ్యాచ్ కీలకంగా మారింది. ఆ మ్యాచ్‌లో జింబాబ్వే గెలిస్తే ఆసీస్ దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. ఒకవేళ జింబాబ్వే ఐర్లాండ్, శ్రీలంక చేతిలో భారీ తేడాతో ఓడిపోయి, అదే సమయంలో ఆస్ట్రేలియా ఒమన్‌పై పెద్ద విజయం సాధిస్తే పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. అప్పుడు రన్‌రేట్ ఆధారంగా ఆసీస్ సూపర్–8 దశకు చేరే అవకాశముంటుంది. అయితే అది కష్టసాధ్యమైన సమీకరణమే.
కంగారులేనా...?
మొత్తం మీద చూస్తే, ఈ టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ప్రయాణం ఆశించిన విధంగా సాగడం లేదు. బలమైన బౌలింగ్ త్రయం లేకపోవడం, కీలక సందర్భాల్లో బ్యాటింగ్ వైఫల్యం జట్టును తీవ్రంగా దెబ్బతీసింది. వరుస ఓటములతో జట్టు మానసికంగా కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇక మిగిలిన మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసి, ఇతర జట్ల ఫలితాలు అనుకూలిస్తేనే ఆసీస్‌కు సూపర్–8 దశలో చోటు దక్కుతుంది. క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా ఒకప్పుడు అప్రతిహతంగా నిలిచిన ఆస్ట్రేలియా ఇప్పుడు గ్రూప్ దశలోనే ఎలిమినేషన్ అంచున నిలవడం విశేషం. చివరి మ్యాచ్, అలాగే జింబాబ్వే–ఐర్లాండ్ పోరు ఆసీస్ భవిష్యత్‌ను నిర్ణయించనున్నాయి. అభిమానులు మాత్రం చివరి వరకు ఆశలు వదలకుండా జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం కంగారులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.