GILL: వన్డేల్లోనూ గిల్ శకం ఆరంభం
ఆస్ట్రేలియా టూర్‌కు జట్టు ప్రకటన... ముగిసిన రోహిత్ కెప్టెన్ శకం... ఇప్పటికే గిల్‌కు టెస్ట్ పగ్గాలు
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టు ప్రకటించింది. ఈ ఏడాదే భారత టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న శుభ్‌మన్ గిల్.. వన్డేల్లోనూ ఆ బాధ్యతలను మోయనున్నాడు. ప్రస్తుతం సారథిగా ఉన్న సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ కెరీర్ ముగింపు దశకు రావడంతో గిల్‌కు వన్డే పగ్గాలను కూడా అప్పజెప్పారు. జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ చోటు దక్కింది. అయితే.. కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఈ మేరకు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మరోవైపు.. మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్, కోహ్లీ ఇద్దరూ మళ్లీ కనబడలేదు. ఆస్ట్రేలియాలో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ల కోసం భారత జట్లను శనివారం సెలక్టర్లు ఎంపిక చేశారు. వన్డే సిరీస్‌లో ఇద్దరికీ స్థానం కల్పించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో 19 రోజుల వ్యవధిలో భారత్ ఎనిమిది మ్యాచ్‌లు (3 వన్డేలు, 5 టీ20లు) ఆడనుంది. అక్టోబరు 19న వన్డే సిరీస్ ఆరంభమవుతుంది. రోహిత్ రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నట్లు ఈ నిర్ణయంతో అర్థమవుతోంది.
తెలుగోడికి చోటు
ఆస్ట్రేలియా టూర్‌లో ఆసీస్‌తో భారత్ ఐదు టీ20లు ఆడనుంది. టీ20 మ్యాచ్‌లు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రెండు సిరీస్‌ల కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. హార్దిక్ పాండ్య గాయపడిన వేళ తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి వన్డే జట్టులో చోటు దక్కింది. మహ్మద్ షమి, రవీంద్ర జడేజా, సంజు శాంసన్‌కు అవకాశం కల్పించలేదు. వన్డేల్లో బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేశారు. టీ20లకు సూర్యకుమార్ యాదవ్‌నే కెప్టెన్‌గా కొనసాగించారు.
వన్డే జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.
టీ 20 జట్టు:
సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్, కుల్‌దీప్, హర్షిత్, సంజు శాంసన్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్.