IPL: గుజరాత్ ఘన విజయం
ముంబైకు వరుసగా రెండో పరాజయం... రాణించిన సాయి సుదర్శన్;
ఐపీఎల్ 2025 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్.... దానిని కొనసాగిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 196/8 పరుగులు చేసింది. 197 పరుగుల లక్ష్యంతో దిగిన ముంబై ఇండియన్స్.. గుజరాత్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేసింది.
గుజరాత్ శుభారంభం..
సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 196 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు.. ఆరంభం నుంచే సుదర్శన్ షాట్లు ఆడుతూ, స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. మరో ఓపెనర్ శుభమన్ గిల్ (38) పరుగులతో రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 78 పరుగులు జోడించారు. వన్ డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ (39)కు సత్తా చాటడంతో ఒక దశలో 129-1తో గుజరాత్ భారీ స్కోరుపై కన్నేసింది. అయితే పుంజుకున్న ముంబై బౌలర్లు గుజరాత్‌ను బ్యాటర్లను కట్టడి చేశారు. మిడిలార్డర్ విఫలం కావడంతో గుజరాత్ 200 పరుగుల మార్కును సాధించలేక పోయింది. తెలుగు పేసర్ సత్యనారాయణ రాజు ఐపీఎల్లో తొలి వికెట్ సాధించాడు. హార్దిక్‌కు రెండు వికెట్లు దక్కాయి.
ఛేదనలో తడబడ్డ ముంబై
197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడింది. విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ (8), ర్యాన్ రికెల్టన్ (6) త్వరగా ఔటయ్యారు. వీరిద్దరి వికెట్లను మహ్మద్ సిరాజ్ తీశాడు. ఈ దశలో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ (39)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు సూర్య ప్రయత్నించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. తిలక్ వెనుదిరిగాక ముంబై ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత సూర్య పోరాడినా మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. కెప్టెన్ హార్దిక్ (11) సహా మిడిలార్డర్ విఫలం కావడంతో ముంబై కోలుకోలేక పోయింది. ఆఖర్లో సూర్య కూడా వెనుదిరగడంతో పోరాటం ముగిసినట్లయ్యింది. సూర్యకుమార్ (48), తిలక్ వర్మ (39) మాత్రమే ఆకట్టుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ప్రసిద్ధ్ నిలిచాడు.