HCA: హెచ్‌సీఏ అధ్యక్ష పదవిపై అజార్ నజర్
పదవి చేపట్టేందుకు అజారుద్దీన్ ఆసక్తి... అసోసియేషన్‌లో వివాదాలతో తెరపైకి;
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అసోసియేషన్ అధ్యక్ష పదవిపై మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మరోసారి కన్నేశారు. అసోసియేషన్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్నాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు అరెస్టు నేపథ్యంలో బోర్డును రద్దు చేసి మరోసారి ఎన్నికలు నిర్వహించాలని అజారుద్దీన్ డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025 టికెట్ల రగడ, నకిలీ పత్రాల సృష్టి, ఆర్థిక అవకతవకలపై ఆరోపణలపై తెలంగాణ సర్కారు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం అవకతవకలు నిజమేనని తేలడంతో హెచ్‌సీఏ అధ్యక్షుడితోపాటు మరో నలుగురిని కూడా సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ అంశంలోకి ఈడీ సైతం అడుగుపెట్టింది. భారీ ఎత్తున ఆర్థిక కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు రావడం, విజిలెన్స్ నివేదికలో సంచలన విషయాలు బయటపడడంతో వాటిపై లోతైన దర్యాప్తు చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏలో నాయకత్వ మార్పు అవసరమని చర్చలు ఊపందుకున్నాయి. దీంతో ఇప్పటికే ఒకసారి హెచ్‌సీఏ అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తించిన హైదరాబాద్ మాజీ క్రికెటర్ అజారుద్దీన్.. మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని ప్రయత్నించి భంగపడ్డారు. అయితే ప్రస్తుతం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని మరోసారి హెచ్‌సీఏకు అధ్యక్షుడు కావాలని ఆయన ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
రీఎంట్రీకి ప్లాన్..?
హెచ్‌సీఏ అధ్యక్షుడి అరెస్టుతో అసోసియేషన్‌లో నాయకత్వ లేమి ఏర్పడింది. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని అజారుద్దీన్ భావిస్తున్నట్టు అనిపిస్తోంది. అవినీతి, అక్రమాలలో కూరుకుపోయిన అసోసియేషన్ కమిటీని తక్షణమే రద్దు చేయాలని, కొత్త కమిటీ ఏర్పాటుకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోహెచ్సీఏ అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్దంగా ఉన్నానని సంకేతాలు ఇస్తున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఉన్న సమయంలో కూడా వివాదాలు చుట్టుముట్టాయి. క్రికెట్లో ఆయనకు ఉన్న అనుభవం, పేరు ప్రఖ్యాతలు అజారుద్దీన్‌కు కలిసొచ్చే అంశాలని మద్దతుదారులు చెబుతున్నారు. పారదర్శకత, సమర్ధ నిర్వహణతో హెచ్‌సీఏను నడిపించగలిగే సత్తా అజర్‌కు ఉన్నాయని చెబుతున్నారు. హెచ్‌సీఏలో పారదర్శకత, సమర్థ నిర్వహణను తిరిగి తీసుకురావడానికి అజారుద్దీన్ సరైన వ్యక్తి అని మద్దతుదారులు వాదిస్తున్నారు. అజర్ మరోసారి హెచ్‌సీఏకు అధ్యక్షుడు కావడం సులభం కాదు.