HCA: హెచ్‌సీఏలో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం
వివాదంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. ఫేక్ సర్టిఫికెట్లతో ప్లేయర్లకు అవకాశాలు.. రాచకొండ సీపీకి ఫిర్యాదు చేసిన అనంతరెడ్డి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో మళ్లీ అలజడి రేగింది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో మసకబారిన హెచ్‌సీఏలో బర్త్ సర్టిఫికేట్ల స్కామ్ సంచలనం రేపుతోంది. నిబంధనలను పూర్తిగా తుంగులో తొక్కుతూ వేర్వేరు విభాగాల్లో నకిలీ బర్త్ సర్టిఫికెట్లు కల్గిన ప్లేయర్లను ఎంపిక చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఏడాది క్రితం సరిగ్గా ఇదే విషయంలో బీసీసీఐ ఆరుగురు ప్లేయర్లపై రెండేండ్ల పాటు విధించిన నిషేధం నుంచి పాఠాలు నేర్వని హెచ్‌సీఏ పాలకవర్గం మరోమారు అక్రమ మార్గంలో ప్లేయర్లను ఎంపిక చేసింది. దీనిపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేయాలంటూ అనంతరెడ్డి అనే వ్యక్తి రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు.
జూనియర్ పోటీల్లో సీనియర్లు...
అండర్ 16, అండర్ 19,అండర్ 23 లీగ్ మ్యాచుల్లో ఆడేందుకు పలువురు ప్లేయర్లు ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేశారన్న ఫిర్యాదు అందింది. నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో లీగ్ లోఎక్కువ వయసు ఉన్న ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తున్నారని తమ ఫిర్యాదులో వెల్లడించారు. గతంలో ఆరుగురు ప్లేయర్స్ ను గుర్తించిన బీసీసీఐ వారిపై బ్యాన్ విధించింది. ఎక్కువ వయసు ఉన్నప్పటికీ లీగ్ లో అడే విధంగా HCA అవకాశమిస్తు్ందన్న ఆరోపణలున్నాయి. దీనివల్ల టాలెంట్ ఉన్న ప్లేయర్లకు నష్టం వాటిల్లితుందని తమ ఫిర్యాదులో వెల్లడించారు. అవినీతికి పాల్పడి టాలెంట్ లేకున్నా ప్లేయర్స్ ను ఆడిస్తున్న HCA అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని రాచకొండ సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో భారీ స్థాయిలో ఆర్థిక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్రం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది.
కఠిన చర్యలు తీసుకోవాలి
"ఒక ఆటగాడికి రెండు బర్త్ సర్టిఫికెట్లు ఎలా ఉంటాయి?" అని అనంత రెడ్డి ప్రశ్నించారు. గతంలో ఇవే సర్టిఫికెట్లను నకిలీగా తెచ్చినప్పటికీ మళ్లీ అదే ఆటగాళ్లను ఎంపిక చేయడం బాధాకరమని పేర్కొన్నారు. వేరే రాష్ట్రాల ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం వల్ల తెలంగాణ యువతకు నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తప్పుడు బర్త్ సర్టిఫికెట్లతో 52 మందిని క్రికెట్ ఆడించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో సెలక్షన్ కమిటీ ఛైర్మన్ హబీబ్ అహ్మద్, సభ్యులు సందీప్ రాజన్, సందీప్ త్యాగ్ పేర్లు ఉన్నాయి. ఇద్దరు ప్లేయర్స్ నుంచి సెలక్షన్ కమిటీ సభ్యులు డబ్బులు డిమాండ్ చేసినట్లు తాజా ఫిర్యాదులో తెలిపారు. క్కువ వయసున్న ప్లేయర్లు నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో లీగ్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తప్పుడు ధ్రువపత్రాలతో..
ద్వంద, నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలతో కొందరు క్రికెటర్లు అడ్డదారిలో హెచ్‌సీఏ లీగ్‌ల్లో ఆడుతూ రాష్ట్ర జట్లలో స్థానం సంపాదిస్తున్నారని ఇద్దరు క్రికెటర్ల తల్లిదండ్రులు రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. గత ఏడాది కూడా కొందరు క్రికెటర్లపై ఇలాంటి ఫిర్యాదులే రావడంతో ఆరుగురిపై హెచ్‌సీఏ నిషేధం విధించింది. ఈసారి సుమారు 38 మంది క్రికెటర్లు ఇదే కోవలో తప్పుడు పత్రాలతో హెచ్‌సీఏ లీగ్‌ల్లో ఆడుతున్నారని అనంతారెడ్డి, రామారావు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఆ క్రికెటర్ల జాబితాపై విచారణ జరపాలని కోరారు. సహకరిస్తున్న హెచ్‌సీఏలోని పెద్దలపై కూడా కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.