HCA: హెచ్‌సీఏ అక్రమాల వెనుక కేటీఆర్, కవిత.!
కీలక మలుపు తిరిగిన అక్రమాల కేసు.. కేటీఆర్, కవితలపై సీఐడీకి ఫిర్యాదు;
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక కుంభకోనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయగా తాజాగా సీఐడీ వారిని కస్టడీలోకి తీసుకుంది. ఆరు రోజుల పాటు సీఐడీ వారిని విచారించనుంది. ఈక్రమంలో సీఐడీ అధికారులు వారిని చర్లపల్లి జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహ్ రావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత యాదవ్, హెచ్‌సీఏ సీఈవో సునీల్, హెచ్‌సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావులను సీఐడీ విచారించనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత మీద తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ).. సీఐడీకి ఫిర్యాదు చేసింది.
సీఐడీకి ఫిర్యాదు
హెచ్‌సీఏ ఎన్నికల్లోకి ఉన్నట్లుండి జగన్మోహన్ రావు రావడం వెనుక కేటీఆర్, కవితల హస్తం ఉందని ఆరోపిస్తూ.. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గురువారం నాడు సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టీసీఏ అధికారులు నేడు అడిషనల్ డీజ చారు సిన్హాను కలిశారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గెలిచిన వెంటనే తన విజయాన్ని కేటీఆర్, కవిత, హరీష్ రావుకి అంకితం చేశారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. దీనిపై ఫిర్యాదు చేస్తూ, కవిత, కేటీఆర్‌తో పాటు హెచ్‌సీఏలోని కొందరు అక్రమార్కులపై దర్యాప్తు చేయాలని కోరారు. గత 10 ఏళ్లలో బీసీసీఐ నుంచి దాదాపు రూ.500-600 కోట్ల నిధులు వచ్చినా, క్రికెట్ అభివృద్ధికి సంబంధించిన పనులు జరగలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సీఐడీ కస్టడీకి హెచ్‌సీఏ నిందితులు
హెచ్‌సీఏ కేసులో ఐదుగురు నిందితులను సీఐడీ కస్టడీకి తీసుకుని విచారించింది. నిందితులను ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతించడంతో చర్లపల్లి జైలు నుంచి అదుపులోకి తీసుకోనున్నారు. హెచ్‌సీఏ క్లబ్స్‌లో అవకతవకలు, గత హెచ్‌సీఏ ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలపై ప్రధానంగా ప్రశ్నించింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు, హెచ్‌సీఏ సీఈవో సునీల్, హెచ్‌సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్‌యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత యాదవ్‌ను సీఐడీ అధికారులు విచారించారు. ఈ ఐదుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన మల్కాజ్గిరి కోర్టు… ఇవాళ్టి నుంచి ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతించింది. హెచ్‌సీఏ స్కామ్‌లో అరెస్టు చేసిన నలుగురు నిందితులతో సహా అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు, సీఐడీ అధికారులు కస్టడీ కోరింది. దీనితో మల్కాజ్గిరి కోర్టు ఆరు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది.
ఈడీకి కూడా..
హెచ్‌సీఏ అక్రమాల వ్యవహారంపై సీఐడీతో పాటు ఈడీకి కూడా ఫిర్యాదు చేసింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. మనీలాండర్ కోణం ఉందని విచారణ జరపాలని టీసీఏ ఫిర్యాదులో తెలిపింది. ఇప్పటికే హెచ్‌సీఏ అక్రమాలపై పూర్తి వివరాలు అందజేయాలని సీఐడీనీ ఈడీ కోరిన విషయం తెలిసిందే. కోట్ల రూపాయలు అవకతవకలు జరగడంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేయనుంది. ఈ క్రమంలో టీసీఏ ఫిర్యాదు, సీఐడీ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈసీఐఆర్ నమోదు చేయనున్నట్లు సమాచారం.