WIMBLEDON 2024: టెన్నీస్ యోధుల మధ్య నేడే మహాసంగ్రామం
వింబుల్డన్ పురుషుల ఫైనల్ నేడు... వింబుల్డన్ టైటిల్ కోసం నొవాక్ జకోవిచ్‌తో కార్లోస్ అల్కరాస్ పోటీ;
టెన్నిస్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వింబుల్డన్ పురుషుల ఫైనల్ నేడు జరగనుంది. నొవాక్ జకోవిచ్‌తో కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్ టైటిల్ కోసం తలపడనున్నాడు. అత్యుత్తమ ఆటగాళ్లుగా భావిస్తున్న ఇద్దరు ఆటగాళ్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. 25వ జకోవిచ్ ఇప్పటికే ఏడు వింబుల్డన్‌లు గెలిచి చరిత్ర సృష్టించాడు. అల్కరాస్ 21 ఏళ్లకే మూడు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచాడు. 24 గ్రాండ్‌స్లామ్‌లతో ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో రికార్డు నెలకొల్పినప్పటికీ.. మార్గరెట్ కోర్ట్‌ను అధిగమించి టెన్నిస్‌లో అత్యధిక టైటిళ్ల రికార్డు నెలకొల్పాలన్న లక్ష్యంతో జకోవిచ్ ఉన్నాడు . అయిదు మ్యాచ్‌ల ముఖాముఖిలో మూడుసార్లు జకోవిచ్, రెండుసార్లు అల్కరాస్ గెలిచారు. 21 ఏళ్ల అల్కరాస్ ఇప్పటిదాకా గ్రాండ్‌స్లామ్స్‌లో ఫైనల్ చేరిన ప్రతిసారీ టైటిల్ నెగ్గాడు. 2022లో యుఎస్ ఓపెన్ 2023లో వింబుల్డన్, ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గాడు.
మహిళల విజేత క్రెజికోవా
తొలిసారి వింబుల్డన్ ఫైనల్ చేరిన చెక్ రిపబ్లిక్ భామ బార్బరా క్రెజికోవా అదేజోరులో టైటిల్‌ను సొంతం చేసుకొంది. శనివారం జరిగిన తుది పోరులో 31వ సీడ్ క్రెజికోవా 6-2, 2-6, 6-4తో ఏడో సీడ్, ఇటలీ తార జాస్మిన్ పౌలినిని ఓడించింది. వింబుల్డన్‌కు ముందు ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నర్‌పగా నిలిచిన జాస్మిన్‌కు ఇక్కడా నిరాశే ఎదురైంది. కాగా, 28 ఏళ్ల క్రెజికోవాకిది కెరీర్‌లో రెండో సింగిల్స్ గ్రాండ్‌స్లామ్. 2021లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది. గంటా 56 నిమిషాలపాటు సాగిన ఫైనల్లో క్రెజికోవా బేస్‌లైన్ షాట్లు ఆడుతూనే తెలివిగా డ్రాప్ చేస్తూ పాయింట్లు రాబడుతుంటే.. ప్రత్యర్థి పౌలినికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. తొలిసెట్ మొదటి గేమ్‌లోనే ఇటలీ ప్లేయర్ సర్వీ్‌సను బ్రేక్ చేసిన బార్బరా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, మూడో గేమ్‌లో సర్వీస్ నిలబెట్టుకొన్న పౌలిని 1-2తో నిలిచింది. కానీ, ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు నెగ్గిన క్రెజికోవా 5-1తో పైచేయి సాధించింది. అదే ఊపులో సెట్‌ను సొంతం చేసుకొంది.
రెండో సెట్‌లో పుంజుకొన్న జాస్మిన్ తొలి మూడు గేమ్‌లు గెలిచి 3-0తో ముందంజ వేసింది. వరుసగా సర్వీ్‌సలను నిలబెట్టుకొంటూ రెండో సెట్‌ను నెగిక్షన పౌలిని.. మ్యాచ్ ఫలితాన్ని మూడో సెట్‌కు తీసుకెళ్లింది. నిర్ణాయక సెట్‌లో ఇద్దరూ సర్వీ్‌సలను నిలబెట్టుకొంటూ 3-3తో హోరాహోరీగా తలపడ్డారు. అయితే, ఏడో గేమ్‌లో డబుల్ ఫౌల్ కారణంగా పౌలిని సర్వీస్ బ్రేక్ కాగా.. తర్వాతి గేమ్ నెగ్గిన బార్బరా 5-3తో ఆధిక్యం సాధించింది. 9వ గేమ్ గెలిచిన జాస్మిన్.. తర్వాతి గేమ్‌లో సమం కోసం పోరాడినా బ్యాక్ హ్యాండ్ తప్పిదంతో మ్యాచ్‌ను చేజార్చుకొంది.