Duke balls: డ్యూక్స్ బాల్స్‌పై రచ్చ.. అంపైర్లకు కొత్త తలనొప్పి
డ్యూక్ బాల్స్ నాణ్యతపై సందేహాలు;
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో డ్యూక్ బాల్స్ నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పది ఓవర్ల వరకు కూడా బంతి నిలవకపోవడం బౌలర్లు, అంపైర్లకు తలనొప్పిగా మారింది. ఈ అంశం అంపైర్లు, ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీస్తోంది. డ్యూక్స్ బాల్స్ నాణ్యత లేకపోవడం వల్ల కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగానే బంతి ఆకారం మారిపోతోంది. బంతిని మార్చాలని ఆటగాళ్లను అంపైర్లను పదేపదే కోరుతున్నారు. బాల్ గేజ్‌తో పరిశీలించిన అంపైర్లు బాల్స్ మారుస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఆటగాళ్లతో అంపైర్లకు వాగ్వాదం జరుగుతోంది.
గిల్ అసహనం..
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ నుంచే బాల్ నాణ్యత సమస్య మొదలైంది. బంతి త్వరగా ఆకారం కోల్పోవడం వల్ల సీమ్, స్వింగ్ బౌలర్లకు తలనొప్పిగా మారింది. లార్డ్స్ టెస్ట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లోనూ డ్యూక్స్ బాల్స్ నాణ్యత తీవ్ర చర్చకు దారితీసింది. 80 ఓవర్ల తర్వాత భారత్ తీసుకున్న కొత్త బంతి కేవలం 63 బంతుల్లోనే ఆకారాన్ని కోల్పోయింది. దీంతో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బంతిని మార్చాలని అంపైర్‌ను కోరాడు. అంపైర్లు ఇచ్చిన కొత్త బంతి కూడా సరిగ్గా లేదని గిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అది 10 ఓవర్ల పాత బంతిలా కాకుండా 20 ఓవర్ల పాత బంతిలా ఉందని అసహనం వ్యక్తం చేసి, అంపైర్‌పై నోరుపారేసుకున్నాడు. సిరాజ్ కూడా బంతి నాణ్యత, షేప్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది 10 ఓవర్ల పాత బంతేనా? అని ప్రశ్నించాడు. కామెంట్రీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ కూడా గిల్‌కు మద్దతు తెలిపాడు. ఆ బంతి 20 ఓవర్లు వేసినంత పాతదిగా ఉందని వ్యాఖ్యానించాడు. మార్చిన బంతి కూడా 48 బంతుల్లోనే ఆకారం కోల్పోవడంతో మరోసారి మార్చాల్సి వచ్చింది. దాంతో డ్యూక్స్ బాల్స్ తయారీదారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిరాజ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది 10 ఓవర్ల పాత బంతినా? అని ప్రశ్నించాడు. కామెంట్రీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ కూడా గిల్‌కు మద్దతుగా నిలిచాడు. ఆ బంతి 20 ఓవర్ల పాతదిగా ఉందని వ్యాఖ్యానించాడు.
80 ఓవర్లు ఆడాలి
ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. ఎక్స్‌వేదికగా బంతి తయారీదారులపై విమర్శలు చేశాడు. 'క్రికెట్ బంతి ఒక అద్భుతమైన వికెట్ కీపర్లా ఉండాలి. దాని నాణ్యత గురించి అస్సలు చర్చించకూడదు. అయితే, ఇప్పుడు బంతి గురించే ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది. బంతి ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ప్రతీ ఇన్నింగ్స్‌లో బంతిని మార్చాల్సి వస్తుంది. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఐదేళ్లుగా ఇలాగే జరుగుతున్నట్లు అనిపిస్తోంది. డ్యూక్స్ బాల్స్ ఒక సమస్యగా మారాయి. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలి. ఒక బంతితో 10 ఓవర్లు కాదు. 80 ఓవర్లు ఆడాలి ' అని స్టువర్ట్ బ్రాడ్ ట్వీట్ చేశాడు.