ICC: ఐసీసీ కొత్త రూల్స్.. ఎవరికి లాభం..?
పాత రూల్స్‌ను మార్చిన ఐసీసీ.. స్టాప్ క్లాక్ సహా కీలక నిబంధనలు అమల్లోకి;
క్రికెట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చడానికి... క్రికెట్ ప్రేమికులకు మరింత జోష్ ఇచ్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆటను రసవత్తరంగా మార్చేందుకు ఎప్పటికప్పుడు నయా రూల్స్ తీసుకొచ్చింది. ఒక్కోసారి ఉన్న నిబంధనలనే సడలించే క్రికెట్ బోర్డు.. అవసరాన్ని బట్టి నయా రూల్స్ కూడా తీసుకొస్తుంది. తాజాగా కొన్ని పాత రూల్స్‌ను మార్చడమే గాక కొన్ని కొత్త నిబంధనలను కూడా ప్రవేశపెట్టింది ఐసీసీ. ఈ రూల్స్ క్రికెట్లో కీలక మార్పులకు అంకురార్పణ చేసే అవకాశం ఉంది.
బౌండరీ క్యాచ్
బౌండరీ లైన్ దాటి గాల్లో బంతిని అందుకుంటే తిరిగి ఒకే ప్రయత్నంలో మైదానంలోకి విసరాలి. విసిరిన వెంటనే గ్రౌండ్లోకి వచ్చి క్యాచ్ అందుకోవాలి. లేకపోతే దాన్ని సిక్స్‌గా పరిగణిస్తారు. వివాదాలు రేగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై సమీక్షించి కొత్త నియమాన్ని తీసుకొచ్చింది మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ). ఈనెల నుంచే ఈ కొత్త నిబంధన అమలు కాబోతోంది. క్యాచ్‌ను పట్టుకునే క్రమంలో తాను బౌండరీ లైన్ దాటే అవకాశముందని ఫీల్డర్ భావిస్తే అది దాటే లోపు బంతిని లోపలే గాల్లోకి వేసి, లైన్ బయటి నుంచి మళ్లీ లోపలికి వచ్చి క్యాచ్ పట్టవచ్చు. నిబంధనల ప్రకారం ఇది సరైన క్యాచే. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. లైన్ ఆవల ఫీల్డర్ ఏ విధంగా బంతిని తాకినా అది నాటౌట్ కిందే లెక్క.
షార్ట్ రన్
క్రీజులో బ్యాట్ పెట్టకుండా ఉద్దేశపూర్వకంగా రన్ పూర్తి చేయకపోతే 5 పరుగులు పెనాల్టీ విధిస్తారు. కావాలని ఇలా పరిగెడితే పెనాల్టీ విధించడమే కాదు.. ఇంకో మెలిక కూడా పెట్టింది ఐసీసీ. ఆ తర్వాతి బంతిని ఏ బ్యాటర్ ఆడాలనేది ఫీల్డింగ్ జట్టు నిర్ణయించేలా చేసింది.
స్టాప్ క్లాక్ రూల్
ఓవర్ ముగిసిన తర్వాత.. మరో ఓవర్‌ను 60 సెకన్లలోపు ఆరంభించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఉల్లంఘిస్తే రెండుసార్లు హెచ్చరిస్తారు. మూడోసారి కూడా రిపీట్ చేస్తే బ్యాటింగ్ జట్టుకు అదనంగా 5 పరుగులను కేటాయిస్తారు. ఇక అదే సమయంలో బౌలింగ్ జట్టు నుంచి 5 పరుగులను కట్ చేస్తారు. ప్రతీ 80 ఓవర్లకు ఈ రూల్ రీస్టార్ట్ అవుతుంది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి 50వ ఓవర్ దాకా రెండు బంతులు వాడుతూ బౌలింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ నిబంధన మారనుంది. ఇకపై ఈ రూల్ 35 ఓవర్ల వరకే ఉంటుంది. అంటే 34 ఓవర్లు ముగిసేదాకా రెండు బంతులను వాడుకొని బౌలింగ్ చేయవచ్చు. కానీ 35వ ఓవర్ తర్వాత 50వ ఓవర్ దాకా ఏదైనా ఒకటే బంతితో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. వర్షం వల్ల లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ 35 ఓవర్లకు కుదించితే ఒక్క బంతితోనే బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.
డీఆర్ఎస్
ఇకపై కీపర్ పట్టిన ఔట్ల విషయంలో అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తాకిందా? లేదా ప్యాడ్‌కు తాకిందా? అనేది చూస్తారు. క్యాచ్ ఔట్ కాకపోతే ఎల్బీడబ్ల్యూ చెక్ చేస్తారు. బాల్ ట్రాకింగ్‌లో ఔట్ అని తేలితే మాత్రం బ్యాటర్ పెవిలియన్ దారి పట్టక తప్పదు. కంకషన్ ప్రోటోకాల్స్‌లో రెండు మార్పులు చేసింది ఐసీసీ. కంకషన్ రీప్లేస్మెంట్ ఎవరనేది ముందే జట్లు చెప్పాల్సి ఉంటుంది. మ్యాచ్ సమయంలో గాయపడి దూరమైన ఆటగాళ్లను 7 రోజుల పాటు గమనిస్తారు. కోలుకున్నారని తేలాకే వారిని తిరిగి ఆడేందుకు అనుమతిస్తారు.