IND vs ENG: రసవత్తరంగా మూడో టెస్ట్
192 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్... \టీమిండియా ముందు 193 పరుగుల లక్ష్యం... 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్;
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా మారింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్‌పై పట్టు బిగించిన టీమిండియా.. బ్యాటింగ్‌లో మాత్రం ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయింది. 193 పరుగుల సాధారణ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 17.4 ఓవర్లలో 4 వికెట్లకు 58 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(33) ఉండగా.. యశస్వి జైస్వాల్(0), కరుణ్ నాయర్(14), శుభ్‌మన్ గిల్(6) మరోసారి తీవ్రంగా నిరాశపర్చారు. నైట్‌వాచ్‌మన్‌గా బరిలోకి దిగిన ఆకాశ్ దీప్(1) కూడా ఔటయ్యాడు.
మెరిసిన సుందర్
ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ నాలుగో రోజు ఆటలోనూ భారత బౌలర్లు దుమ్మురేపారు. వాషింగ్టన్ సుందర్(4/22) నాలుగు వికెట్లతో రఫ్పాడించడంతో 2/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 62.1 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. జోరూట్(96 బంతుల్లో ఫోర్‌తో 40), బెన్ స్టోక్స్(96 బంతుల్లో 3 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో సుందర్‌కు తోడుగా జస్ప్రీత్ బుమ్రా(2/38), మహమ్మద్ సిరాజ్(2/31) రెండేసి వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ తలో వికెట్ పడగొట్టారు. దాంతో భారత్ ముందు 193 పరుగుల లక్ష్యం నమోదైంది. మహమ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ తొలి సెషన్లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. బెన్ డకెట్(12), ఓలీ పోప్(4)లను సిరాజ్ పెవిలియన్ చేర్చితే జాక్ క్రాలీ(22)ని నితీష్ కుమార్ రెడ్డి ఔట్ చేశాడు. హ్యారీ బ్రూక్(23)ను ఆకాశ్ దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్, జో రూట్ ఆచితూచి ఆడి మరో వికెట్ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు.
భారత్‌కు షాక్
రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత్‌కు షాక్ తగిలింది. యశస్వి జైస్వాల్ (0)ను జోఫ్రా ఆర్చర్ వెనక్కి పంపాడు. మరో ఎండ్‌లో రాహుల్ నిలకడగా ఆడటంతో 12 ఓవర్లకు 40/1తో భారత్ మెరుగైన స్థితిలో కనిపించింది. కానీ, బ్రైడన్ కార్స్ వరుస ఓవర్లలో కరుణ్ నాయర్ (14), శుభ్‌మన్ గిల్ (6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో భారత్‌కు గట్టిషాక్ ఇచ్చాడు. ఈ దశలో నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన ఆకాశ్ దీప్‌ని బెన్ స్టోక్స్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో వికెట్ తీసారు. భారత్ విజయానికి ఇంకా 135 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లండ్‌కు 6 వికెట్లు కావాలి. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారింది. ఆఖరి రోజు ఆట తొలి సెషన్ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించనుంది.