IND vs eng: చెలరేగిన బుమ్రా..నిలిచిన రాహుల్
ఆసక్తికరంగా మూడో టెస్టు... 387 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్... రెండో రోజు 145 రన్స్ చేసిన భారత్;
లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆచితూచి ఆడుతోంది. ఓవర్ నైట్ స్కోర్ 251/4తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. రూట్ (104) శతకం చేయగా, బ్రైడన్ కార్స్ (56), జేమీ స్మిత్ (51) అర్ధశతకాలు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (53), రిషభ్ పంత్ (19) ఉన్నారు. ప్రస్తుతం భారత్.. ఇంగ్లాండ్ కంటే 242 పరుగుల వెనుక ఉంది. రెండో రోజు కేవలం 75 ఓవర్లే వేశారు.
మళ్లీ నిలిచిన జేమీ స్మిత్
ఓవర్‌నైట్ స్కోర్ 251 పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పెట్టిన ఇంగ్లాండ్‌కు బుమ్రా షాక్ ఇచ్చాడు. 260 పరుగుల వద్ద ఆ జట్టు కెప్టెన్ స్టోక్స్‌ను (44) ఔట్ చేశాడు. శతకం చేసిన ఆనందంలో ఉన్న రూట్ (104)ను మరో అద్భుత బంతితో బుమ్రా బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బంతికే క్రిస్ వోక్స్‌ను బమ్రా బోల్తా కొట్టించాడు. దీంతో ఆ జట్టు 271 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 300 పరుగులలోపే ఆ జట్టు ఆలౌట్ అయ్యేలా కనిపించింది. అయితే జేమీ స్మిత్ (51: 56 బంతుల్లో), బ్రైడన్ కార్స్ (56) మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. లంచ్ బ్రేక్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 353/7 స్కోర్‌తో నిలిచింది.అయితే ఈ జోడీని సిరాజ్ విడదీశాడు. 355 పరుగుల వద్ద కీపర్ ధ్రువ్ జురేల్‌కు క్యాచ్ ఇచ్చి స్మిత్ ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్‌కు స్మిత్, బ్రైడన్ జోడీ 87 పరుగులు జోడించారు.
నిలబడిన నయా వాల్..
యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. మూడు ఫోర్లు కొట్టి ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన జైస్వాల్ (13) పరుగులకే ఆర్చర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కరుణ్ నాయర్ (40: 62 బంతుల్లో 4 ఫోర్లు)తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. మరోవికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన వీరు అడపాదడపా షాట్లతో అలరించారు. దీంతో ట్రీ బ్రేక్ ముగిసే సమయానికి భారత్ 44 పరుగులతో నిలిచింది. ఓవైపు రాహుల్ క్రీజులో నిలుదొక్కుకునేందుకు ప్రయత్నించగా.. కరుణ్ నాయర్ వేగంగా పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 74 పరుగుల వద్ద స్టోక్స్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి కరుణ్ ఔటయ్యాడు. కెప్టెన్ శుభుమన్ గిల్ (16) క్రీజులోకి వచ్చాడు. గత రెండు మ్యాచ్‌ల్లో సూపర్ ఫామ్‌తో అదరగొట్టిన గిల్ ఈ సారి భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో 107 పరుగుల వద్ద జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ కాస్త ఒత్తిడికి గురైంది. అయితే రిషభ్ పంత్ (19*)తో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన రాహుల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో 39వ ఓవర్ తొలిబంతికి బషీర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి రాహుల్ అర్ధశతకం చేశాడు.