IND vs PAK: ఊపిరి బిగపట్టే సమరానికి సర్వం సిద్ధం
నేడు భారత్-పాక్ హై వోల్టేజ్ మ్యాచ్... ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్... ప్రపంచకప్ లోనే ఫుల్ క్రేజ్ ఉన్న మ్యాచ్
భారత్–పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే క్రికెట్ ప్రపంచానికి హై టెన్షన్. మైదానంలో ఆటగాళ్లే కాదు, స్టేడియంలో ప్రేక్షకులు, టీవీల ముందు కూర్చున్న అభిమానులు కూడా ఉత్కంఠతో ఊపిరి బిగపట్టే సమరం అది. అలాంటి హై-వోల్టేజ్ పోరుకు వేదికగా నిలవబోతున్న కొలంబోలో వర్షం కూడా ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఫిబ్రవరి 15న జరగనున్న ఇండియా–పాక్ మ్యాచ్ మధ్యలోనే అంతరాయం కలగొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కొలంబో ఈ కీలక పోరు జరగనుంది. గ్రూప్ ‘ఏ’లో ఉన్న భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు ఆడిన రెండేసి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. సూపర్-8 అర్హత దిశగా ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. గెలిచిన జట్టు గ్రూప్ టాపర్‌గా నిలిచి తదుపరి దశకు ఆత్మవిశ్వాసంతో వెళ్లే అవకాశముంది.
ఇరు జట్ల ఫామ్
ఈ టోర్నీలో భారత్ తొలి మ్యాచ్‌లో అమెరికాపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో నమీబియాపై 93 పరుగుల భారీ తేడాతో గెలిచి గ్రూప్‌లో బలమైన స్థితిని సంపాదించింది. మరోవైపు పాకిస్తాన్ నెదర్లాండ్స్, అమెరికా జట్లపై విజయాలు నమోదు చేసింది. ఇరు జట్లూ సమాన ఫామ్‌లో ఉండటంతో పోరు మరింత ఆసక్తికరంగా మారింది. భారత్ జట్టుకు కెప్టెన్ సూర్య భాయ్ ఈ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక మార్పులు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ కూర్పులో కొన్ని మార్పులు కనిపించాయి. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పూర్తి కోటాను వినియోగించకపోవడం గమనార్హం. పాక్ మ్యాచ్ కోసం బౌలింగ్ కాంబినేషన్‌ను సర్దుబాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇరు జట్లకు చాలా కీలకం
సూపర్-8 అర్హత దిశగా ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. నెట్ రన్‌రేట్, పాయింట్ల సమీకరణలో ఆధిక్యం సాధించాలంటే గెలుపు అవసరం. ముఖ్యంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విజయం సాధించడం భారత జట్టుకు మానసిక ఆధిక్యాన్ని ఇస్తుంది. మరోవైపు పాక్ జట్టుకు కూడా ఇదే పరిస్థితి. వర్షం అడ్డంకిగా మారుతుందా? లేక పూర్తి మ్యాచ్ జరుగుతుందా? అన్నది ఇప్పుడు అభిమానుల చర్చనీయాంశం. అయితే వర్షం వచ్చినా కూడా అభిమానుల ఉత్సాహం తగ్గేలా కనిపించడం లేదు. ఇండియా–పాక్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ, ఆవేశం, భావోద్వేగాల మేళవింపు. ఈసారి కూడా అదే వాతావరణం కొలంబోలో నెలకొననుంది. మొత్తంగా చూస్తే, భారత్–పాకిస్తాన్ మ్యాచ్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. వర్షం ఆందోళన ఉన్నప్పటికీ, ఇరు జట్లు గెలుపు కోసం సిద్ధమవుతున్నాయి. అభిమానులు మాత్రం ఈ హై-టెన్షన్ పోరును ఆస్వాదించేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కారణంగా కొలంబోకు విమాన టికెట్ల ధరలు అమాంతం పెరిగాయి. ముంబయి–కొలంబో–ముంబయి రౌండ్ ట్రిప్ టికెట్ ధరలు నిమిషాల వ్యవధిలోనే రూ.10,000 వరకు పెరిగినట్లు ట్రావెల్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ రూట్లో టికెట్ ధరలు దాదాపు రూ.60,000 వరకు చేరినట్లు సమాచారం. భారత్‌లోని ఇతర నగరాల నుంచి కూడా కొలంబోకు వెళ్లే విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో స్పష్టమవుతోంది.