IND vs SA: ఒక్కరోజే నేలకూలిన 16 వికెట్లు
ఈడెన్‌లో మలుపులు తిరుగుతున్న మ్యాచ్.. తొలి ఇన్నింగ్స్‌లో 189 రన్స్‌కే భారత్ ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కుప్పకూలిన సౌతాఫ్రికా
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కొనసాగుతున్న భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ రెండో రోజు అసలు టెస్ట్ క్రికెట్ ఎలాంటి అనూహ్య మలుపులు తెస్తుందో అచ్చం అలాగే కొనసాగింది. ఒక్క రోజులోనే 16 వికెట్లు పడడంతో మ్యాచ్ నిరాశాజనకంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 159 పరుగులకే ఆలౌట్ కావడం, ఆ తర్వాత భారత్ 189 పరుగులకే కుప్పకూలిపోవడం ఈ రెండూ బౌలర్ ఫ్రెండ్లీ పిచ్ పరిస్థితులను స్పష్టం చేశాయి.
189 పరుగులకు ఆలౌట్
టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌటైంది. దాంతో 30 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారిన పిచ్‌పై భారత బ్యాటర్లు తేలిపోయారు. కేఎల్ రాహుల్(119 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39), వాషింగ్టన్ సుందర్(82 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రిషభ్ పంత్(45 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27), రవీంద్ర జడేజా(45 బంతుల్లో 3 ఫోర్లతో 27) పర్వలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(3/35), సిమన్ హర్మర్(4/30) భారత్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్, కోర్బిన్ బోష్ చెరో వికెట్ పడగొట్టారు. 37/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై ఓవర్‌నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్(39), వాషింగ్టన్ సుందర్(29) ఆచితూచి ఆడారు. రెండో సెషన్లో సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో 51 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లు కోల్పోయింది.
దక్షిణాఫ్రికా మరోసారి భారత బౌలర్ల స్పిన్, పేస్ కాంబినేషన్‌కు బలైంది. రెండో రోజు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 93 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడింది. క రెండో రోజు ఆట ముగిసే సమయానికి 63 పరుగుల ఆధిక్యం ఉన్నా చేతిలో ఇంకా ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే ఉండటంతో మ్యాచ్ మూడో రోజు తొలి సెషన్లోనే ఫలితం దిశగా వెళ్లనుంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో రికెల్టన్, మార్క్రమ్ మంచి ఆరంభం ఇచ్చినా, మధ్య ఓవర్లలో బుమ్రా తన అద్భుతమైన స్పెల్‌తో మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. 14 ఓవర్లలో 5 మెడెన్స్తో 27 పరుగులకే ఐదు వికెట్లు తీశాడు. సిరాజ్, కుల్దీప్ కూడా కలిసివచ్చి మొత్తం సౌతాఫ్రికా లైనప్‌ను 159కే ముగించారు.