IND vs SA: అదరగొట్టిన బౌలర్లు..బెదరగొట్టిన అభిషేక్
మూడో టీ 20లో టీమిండియా విజయం... 117 పరుగులకే కుప్పకూలిన సఫారీలు... సమష్టిగా రాణించిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్
సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో రెండో టీ20లో పరాజయం పాలైన భారత్ తిరిగి పుంజుకుంది. మూడో టీ20లో భారీ విజయాన్ని నమోదు చేసింది. ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ జట్టులో మార్క్రమ్(61) తర్వాత ఎవరూ రాణించలేదు. భారత బౌలర్ల ధాటికి డికాక్(1), హెండ్రిక్స్(0), బ్రెవిస్(2), స్టబ్స్(9), కార్బినో బోష్(4), జాన్సెన్(2) తేలిపోయారు. భారత బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్ల సత్తాచాటి సఫారీల పతనాన్ని శాసించారు. అనంతరం 118 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 15.5 ఓవర్లలో ఛేదించింది. 3 వికెట్లు కోల్పోయి 120 రన్స్ చేసింది. అభిషేక్(35) ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించగా.. గిల్(28), తిలక్(25 నాటౌట్) విలువైన రన్స్ జోడించారు. ఈ విజయంతో భారత జట్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో భారత పేసర్లు అదరగొట్టారు. గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న మన పేసర్లు తమదైన పేస్‌తో నిప్పులు చెరిగారు. పిచ్ పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ మొదట్లోనే సఫారీలను కోలుకోలేని దెబ్బకొట్టారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ రెజా హెండ్రిక్స్(0)ను అర్ష్‌దీప్‌సింగ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. స్వింగ్‌ను సరిగ్గా అర్థం చేసుకోని హెండ్రిక్స్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. హర్షిత్ రానా రెండో ఓవర్లో ఈసారి డికాక్(1) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా 1 పరుగుకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఇదే జోరులో రానా బౌలింగ్‌లో బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న డెవాల్డ్ బ్రెవిస్(2) మూడో వికెట్‌గా వెనుదిరుగడంతో స్కోరు 7 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయింది.
స్వల్ప లక్ష్యఛేదనలో భారత్‌కు మెరుగైన శుభారంభం దక్కింది. ఓపెనర్లు అభిషేక్‌శర్మ, శుభ్‌మన్ గిల్ దూకుడు కనబరిచారు. తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్స్ బాదిన అభిషేక్ ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పగా, గిల్ ఆదిలోనే ఎల్బీడబ్ల్యూ ఔట్ నుంచి బయటపడ్డాడు. యాన్సెన్ బౌలింగ్‌లో డీఆర్ఎస్ ద్వారా లైఫ్ దక్కించుకున్న గిల్..అభిషేక్‌కు జతకలిశాడు. వీరిద్దరు సఫారీ బౌలర్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ బౌండరీలు బాదడంతో రెండు ఓవర్లలోనే టీమ్ఇండియా స్కోరు 32కు చేరుకుంది. అయితే ఇన్నింగ్స్ జోరందుకుంటున్న తరుణంలో బాచ్ బౌలింగ్‌లో మార్క్మ్ సూపర్ క్యాచ్‌తో అభిషేక్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.