IND vs SA: ఎలాంటి ప్రయోగాలు లేవ్.. ఎర్రమట్టి పిచ్
కోల్‌కతా దెబ్బకు మారిన టీమిండియా తీరు... రెండో టెస్టుకు సంప్రదాయ ఎర్రమట్టి పిచ్.. బౌన్స్‌తో పాటు స్పిన్‌కు అనుకూలంగా పిచ్
ఈడెన్ గార్డెన్స్‌లో స్పిన్ ట్రాక్‌పై ఎదురైన పరాభవంతో భారత జట్టు రెండో టెస్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దక్షిణాఫ్రికాతో ఈనెల 22 నుంచి గువాహటిలో జరిగే ఈ మ్యాచ్ కోసం స్పిన్‌తో పాటు పేస్‌కు అనుకూలంగా ఉండేలా వికెట్‌ను కోరుకుంటోంది. అక్కడి పిచ్ కూడా ఎర్ర మట్టితో రూపొందించనుండడంతో పేసర్లకు చక్కటి బౌన్స్ లభించే అవకాశం ఉంది. బర్సాపర స్టేడియంలో జరిగే తొలి టెస్టు ఇదే కావడంతో విమర్శలకు తావీయకూడదనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. అందుకే బోర్డు హెడ్ క్యురేటర్ ఆశిష్ భౌమిక్ కూడా పిచ్‌ను పర్యవేక్షిస్తున్నారు. ‘ఇక్కడి పిచ్‌ను ఎర్రమట్టితో తయారుచేశారు. దీంతో ఇది ఎక్కువ పేస్, బౌన్స్‌ను అందించే తత్వం కలిగి ఉంటుంది. హోమ్ సీజన్‌కు ముందే భారత్ తమ డిమాండ్‌ను స్పష్టంగా చెప్పింది. అయితే అస్థిర బౌన్స్ మాత్రం ఉండకూడదనే క్యురేటర్ ప్రయత్నిస్తున్నాడు’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. తొలి టెస్టు జరిగిన కోల్‌కతా పిచ్ మొదటి రోజే అదనపు బౌన్స్‌తో పాటు స్పిన్‌కు అనుకూలంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఇరు జట్ల బ్యాటర్లకు పరుగులు తీయడం కష్టంగా మారింది.
బీసీసీఐ వాదన ఇదీ..
ఒక బీసీసీఐ వర్గం తెలిపిందేమంటే.. "ఈ పిచ్ రెడ్ సాయిల్‌తో తయారు అవుతోంది. సహజంగానే వీటిలో స్పీడ్, బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. టీమిండియా హోం సీజన్ ప్రారంభానికి ముందే తమ డిమాండ్లు స్పష్టంగా చెప్పింది. అందుకే పిచ్ టర్న్ ఇస్తే, అది వేగంతో పాటు బౌన్స్‌తో వస్తుంది. ఎక్కువ వేరియబుల్ బౌన్స్ ఉండకుండా క్యూరేటర్లు కృషి చేస్తున్నారు." గువాహటి పిచ్ కూడా కోల్‌కతా పిచ్‌లానే ఉంటుందా అని గంభీర్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన తాను తొలి రోజు నుంచే టర్న్ ఇస్తున్న పిచ్ కావాలని ఎప్పుడూ కోరలేదని స్పష్టం చేశాడు.
గంభీర్ కీలక వ్యాఖ్యలు
"టర్నింగ్ వికెట్ అయినా, తొలి రోజు నుంచే ఎక్కువ టర్న్ ఉండకూడదు. టాస్ కీలకమవకుండా ఉండాలి. మేమెప్పుడూ చెడ్డ పిచ్‌లు లేదా ర్యాంక్ టర్నర్లు కావాలని అనలేదు. ఈ మ్యాచ్ గెలిచి ఉండి ఉంటే, ఎవరూ పిచ్ గురించి మాట్లాడరు. మేము మానసికంగా, నైపుణ్య పరంగా మెరుగుపడాలి, పిచ్‌పై చర్చలు ఆపాలి. ఎందుకంటే పిచ్ రెండు జట్లకూ ఒకటే. గువాహటి ఏ పిచ్ ఇచ్చినా, ఆ పరిస్థితుల్లో ఆడగలిగే ఆటగాళ్లు మన దగ్గర ఉన్నారు" అని గంభీర్ అన్నాడు.
ప్రాక్టీస్ అలా..
ఈడెన్‌లో స్పిన్నర్లను దీటుగా ఆడలేక విమర్శల పాలైన భారత బ్యాటర్లు నెట్ సెషన్లో ఆ దిశగా దృష్టి సారించారు. ప్రస్తుతం కోల్‌కతాలోనే ఉన్న ప్లేయర్లు నెట్ ప్రాక్టీస్ చేశారు. ఇది ఆప్షనల్ కావడంతో కొంతమందే బరిలోకి దిగారు. ముఖ్యంగా సాయి సుదర్శన్‌తో పాటు ధ్రువ్ జురెల్ సింగిల్ ప్యాడ్‌ను ధరించి ప్రాక్టీ్‌సలో పాల్గొన్నారు. ఇది రిస్క్‌తో కూడుకున్నదైనప్పటికీ ఎడమచేతి బ్యాటర్ సుదర్శన్ సులువుగా ఫ్రంట్ ఫుట్ షాట్ ఆడేందుకు.. కుడి కాలి ప్యాడ్‌ను తొలగించాడు. ఈ సందర్భంలో డిఫెన్స్ ఆడాలంటే కాలును కాకుండా బ్యాట్‌ను అడ్డుగా పెట్టాల్సి ఉంటుంది. జట్టులోని లెఫ్ట్ హ్యాండర్లు స్పిన్‌ను ఎదుర్కొనే క్రమంలో బ్యాక్ ఫుట్ తీసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. అందుకే ముందుకు వచ్చి ఆడేలా సింగిల్ ప్యాడ్‌తో ప్రాక్టీస్ చేస్తున్నారు. జురెల్ రివర్స్ స్వీప్ షాట్లు ఎక్కువగా ఆడాడు. రెండో టెస్టు గెలవాలని టీమిండియా గట్టి పట్టుదలగా ఉంది.