IND vs SA: తొలి వన్డేలో విరాట్ విశ్వరూపం
దక్షిణాఫ్రికాపై శతక్కొట్టిన కింగ్ కోహ్లీ.. రెండేళ్ల తర్వాత విరాటుడి శతకం.. అర్ధ శతకంతో మెరిసిన రోహిత్ శర్మ
రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో కింగ్ కోహ్లీ చెలరేగిపోయారు. ప్రొటీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న అద్భుత శతకం చేశాడు. ఈ శతకంతో రిటైర్మెంట్ ఊహాగానాలకు చెరదించాడు. కోహ్లీ రికార్డు శతకానికి తోడు రోహిత్, రాహుల్ అర్ధ శతకాలతో మెరవడంతో భారత్ 349 పరుగుల భారీ స్కోరు చేశాడు. అనంతరం దక్షిణాఫ్రికా 289 పరుగులకే పరిమితమైంది.
చెలరేగిన రో-కో
తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (135; 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) అద్భుతమైన సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ (57, 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (60; 56 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. కోహ్లీకి వన్డే కెరీర్లో ఇది 52వ సెంచరీ. అలాగే అతడు దాదాపు రెండేళ్ల తర్వాత చేసిన సెంచరీ ఇది. విరాట్ ఇంతకు ముందు చివరిసారిగా 15 నవంబర్ 2023లో వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఆస్ట్రేలియా మీద 117 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13), అర్ష్‌దీప్ సింగ్ (0) విఫలమయ్యారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ క్రీజులోకి వచ్చీరాగానే ఫోర్‌తో ఖాతా తెరిచాడు. క్రీజులో ఉన్నంత సేపు మంచి రిథమ్‌లోనే కనిపించాడు. కానీ దూకుడుగా ఆడే ప్రయత్నంలో జైస్వాల్ (18) నాండ్రే బర్గర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా (32) సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఓట్నీల్ బార్ట్‌మన్, నాండ్రే బర్గర్, మార్కో యాన్సెన్, కోర్బిన్ బాష్ తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది.
సచిన్ రికార్డు బ్రేక్
ఈ వన్డేలో విరాట్ కోహ్లీ 52వ సెంచరీ సాధించాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక శతకాల రికార్డు కోహ్లీ పేరిటే ఉంది. అయితే దక్షిణాఫ్రికాపై అత్యధిక వన్డే శతకాలు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. తాజాగా సఫారీలపై ఆరో వన్డే శతకాన్ని కింగ్ కోహ్లీ నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. మరోవైపు రాంచీ రారాజు తానేనని కోహ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. 350 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా పోరాడిన ఫలితం లేకపోయింది. మార్కో జాన్సన్ 70 పరుగులు, బ్రెట్జ్కీ 72 పరుగులు, జోర్జీ 39, బ్రెవీస్ 37 పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ రాణించారు.