INDIAN ARMY: జయహో సైనికా

యుద్ధవీరులకు ఆటగాళ్ల సెల్యూట్;

Update: 2025-05-10 06:00 GMT

‘ఆపరేషన్‌ సిందూర్‌’ అనంతరం భారత్‌ - పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. దేశ సరిహద్దుల్లో పాక్‌ పాల్పడుతున్న దుశ్చర్యలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. దేశ ప్రజల సంరక్షణ కోసం శ్రమిస్తోన్న త్రివిధ దళాలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. సైన్యం సేవలను కొనియాడుతూ తాజాగా పలువురు క్రీడాకారులు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. సైన్యం వెంటే తాము ఉన్నట్లు తెలిపారు. భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మహాభారతంలో శ్రీ కృష్ణుడు.. అర్జునుడికి నువ్వు శాంతి కోసం చేయాల్సింది అంత చేశావు. ఇప్పుడు వారు కోరుకుంటున్న యుద్ధం ఏంటో వారికి చూపించు' అంటూ చేసిన హితబోదని షేర్ చేశాడు.

*పాక్‌ ఇక మర్చిపోలేదు: సెహ్వాగ్

‘ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినప్పుడు పాక్‌ మౌనంగా ఉండాలి. కానీ, ఆ ఛాన్స్‌ను వదులుకొని యుద్ధం కోరుకుంది. ఉగ్రవాదుల ఆస్తులను రక్షించడం, వారి గురించి ఎక్కువగా మాట్లాడటం చేసింది. దానికి మన భద్రతా దళాలు తప్పకుండా సరైన సమాధానం ఇస్తుంది. అదీనూ పాకిస్థాన్‌ ఎప్పటికీ మరిచిపోలేని రీతిలో ఉంటుంది’

*ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తా: రోహిత్

‘దేశ సంరక్షణలో భాగంగా మన సైన్యం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. మన దేశ గౌరవాన్ని పెంచడంలో వారు ఎప్పుడూ ముందుంటారు. కాబట్టి, ఇలాంటి క్లిష్ట సమయాల్లో తప్పుడు కథనాల వ్యాప్తి, అలాంటి వార్తలను నమ్మకుండా ప్రతీ భారతీయుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’.

సైనికులకు సెల్యూట్‌: కోహ్లీ

‘క్లిష్ట సమయంలో అనుక్షణం దేశాన్ని సంరక్షిస్తోన్న మన సైనికులకు సెల్యూట్‌. మన వీరుల అచంచల ధైర్యసాహసాలకు, దేశం కోసం వారితోపాటు వారి కుటుంబాలు చేసే త్యాగాలకు మనమంతా ఎప్పటికీ రుణపడి ఉండాలి’.

త్యాగమే మన బలం: సింధు

‘మీ ధైర్యం, క్రమశిక్షణ, త్యాగమే మన జాతికి బలం. ఆపరేషన్ సిందూర్ వంటి పరిస్థితుల వేళ మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మీ ధైర్యం, నిస్వార్థ సేవలను ఎల్లవేళలా మేము గుర్తు చేసుకుంటాం. దేశం మొత్తం మీ వెంట నడుస్తోంది’.

ఆర్మీ సాహసాలతో గర్వపడుతున్నాం: నీరజ్‌చోప్రా

‘అత్యంత ధైర్యవంతమైన భారత ఆర్మీ పట్ల గర్వపడుతున్నాం. దేశం కోసం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భద్రతా దళాలకు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రతిఒక్కరూ ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను పాటించి సురక్షితంగా ఉండాలి. జై భారత్, జై భారత్‌కీ సేన'. **ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన దేశం కోసం పోరాడుతున్న ధైర్యవంతులైన భారత సాయుధ దళాలను చూసి మేం గర్విస్తున్నాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించడానికి మన వంతు కృషి చేద్దాం, మార్గదర్శకాలను పాటిద్దాం. జై హింద్, జై భారత్, జై హింద్ సైన్యం’ అంటూ ట్వీట్ చేశాడు.** 

Tags:    

Similar News