IPL: మళ్లీ రో"హిట్".. సన్‌రైజర్స్ ఘోర ఓటమి
కేవలం 143 పరుగులకే పరిమితమైన రైజర్స్...26 బాల్స్ మిగిలి ఉండగానే గెలిచిన ముంబై;
ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బుధవారం హోంగ్రౌండ్ ఉప్పల్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు, బౌలర్లు చేతులెత్తేశారు. దీంతో వరుసగా రెండో సారి ముంబై చేతిలో మట్టికరిచింది. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై కట్టదిట్టమైన బౌలింగ్‌తో అదరగొట్టింది. ట్రెంట్ బోల్ట్ తన ఫెంటాస్టిక్ సీమ్‌తో ఓపెనర్లు హెడ్(0), అభిషేక్ శర్మ(8)లను తన మొదటి రెండు ఓవర్లలోనే వెనక్కి పంపాడు. మరో బౌలర్ దీపక్ చాహర్ కూడా తన మొదటి రెండు ఓవర్లలోనే.. ఇషాన్ ఇషాన్(1), నితీష్ రెడ్డి(2)లను పెవిలియన్‌కు పంపాడు. పవర్ ప్లే ముగిసేసరికి సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 24 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజ్‌లోకి వచ్చినా కీపర్ క్లాసెన్ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 44 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేసి బుమ్రా చేతిలో వెనుదిరిగాడు. క్లాసెన్‌కు తోడుగా అభినవ్ మనోహర్(43) నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 8 వికెట్లు కోల్పోయి 143 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.
'హిట్' మ్యాన్ షో
లక్ష్య సాధనలో బరిలోకి దిగిన ముంబైకు హైదరాబాద్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ షాకిచ్చాడు. తన మొదటి ఓవర్లోనే ర్యాన్ రికెల్టన్(11) వెనక్కి పంపాడు. వికెట్ అనంతరం ఏ మాత్రం తడబడిన ముంబై బ్యాటర్లు రోహిత్ శర్మ(70), సూర్యకుమార్ యాదవ్(40*)మెరుపులతో 15.4 ఓవర్లోనే మ్యాచ్ ఫినిష్ చేశారు.