IPL: ముంబైకు వరుసగా అయిదో విజయం

సూర్య, రికెల్టన్ మెరుపు ఇన్నింగ్స్... లక్నోను వణికించిన బుమ్రా;

Update: 2025-04-28 01:30 GMT

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హార్దిక్ సేనకు వరుసగా ఇది ఐదో గెలుపు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో లక్నో 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ ర్యాన్ రికెల్‌టన్ (58; 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (54; 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలతో చెలరేగడంతో భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటరల్లో మిచెల్ మార్ష్‌ (34), నికోలస్ పూరన్ (27), ఆయుష్‌ బదోని (35; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ మిల్లర్ (24; 16 బంతుల్లో 3 ఫోర్లు) దూకుడుగా ఆడినా భారీ స్కోర్లు చేయలేకపోయారు. బుమ్రా నాలుగు వికెట్లు తీసి లక్నో బ్యాటర్లను బెంబేలెత్తించాడు.

రికెల్టన్, సూర్య దూకుడు

ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్‌, సూర్య ఆటే హైలైట్‌. ప్రిన్స్‌ యాదవ్‌ రెండో ఓవర్లోనే రికెల్టన్‌.. 6, 4, 4 బాదాడు. రికెల్టన్‌ జోరు కొనసాగింది. దిగ్వేశ్‌ ఆరో ఓవర్లో అతడు 6, 4, 6 దంచి 25 బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడు. దిగ్వేశ్‌ ఓవర్లో భారీ షాట్‌ ఆడబోయిన అతడు.. బదోనికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రికెల్టన్‌ నిష్క్రమించిన కొద్దిసేపటికే ముంబై.. జాక్స్‌, తిలక్‌ (6), హార్దిక్‌ (5) వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. రికెల్టన్‌ స్థానంలో వచ్చిన సూర్య మాత్రం లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అవేశ్‌ 18వ ఓవర్లో సిక్సర్‌తో ఈ సీజన్‌లో మూడో అర్ధ శతకాన్ని పూర్తిచేసినా మరుసటి బంతికే నిష్క్రమించాడు. ఆఖర్లో నమన్‌ (25 నాటౌట్‌), కార్బిన్‌ (20) వేగంగా ఆడారు. దీంతో ముంబై 215 పరుగుల భారీ స్కోరు చేసింది.

బుమ్రా వణికించాడు

భారీ ఛేదనలో లక్నో ఆరంభం నుంచే తడబడింది. మూడో ఓవర్లోనే బుమ్రా.. మార్క్మ్‌ (9)ను ఔట్‌ చేసి లక్నోను తొలిదెబ్బ కొట్టాడు. వన్‌ డౌన్‌లో వచ్చిన పూరన్‌ (27).. చాహర్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లతో రెచ్చిపోయాడు. కానీ ఏడో ఓవర్లో బౌలింగ్‌ మార్పుగా వచ్చిన విల్‌ జాక్స్‌.. పూరన్‌తో పాటు పంత్‌ (4)నూ పెవిలియన్‌కు పంపి లక్నోకు డబుల్‌ షాకులిచ్చాడు. 15వ ఓవర్లో మరోసారి బంతినందుకున్న బౌల్ట్‌.. బదోనిని పెవిలియన్‌కు పంపాడు. ఇక అక్కడ్నుంచి లక్నో పతనం వేగంగా సాగింది. బుమ్రా 16వ ఓవర్లో మిల్లర్‌ (24), అబ్దుల్‌ సమద్‌ (2), అవేశ్‌ను బౌల్డ్‌ చేయడంతో లక్నో ఓటమి పాలైంది.

Tags:    

Similar News