IPL: ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్?
లక్నో ఓటమిపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు... విచారణ జరపాలని డిమాండ్;
ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపుతోంది. ఈ నెల 19న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఉద్దేశపూర్వకంగానే ఓడిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) అడ్ హక్ కమిటీ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే జైదీప్ బిహానీ ఆరోపించారు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఎలా ఓడిపోయిందంటూ ప్రశ్నించిన ఆయన వెంటనే ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే, రాజస్థాన్ యాజమాన్యం RCLను పక్కనపెట్టిందని జైదీప్ బిహానీ ఆరోపించారు. దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఐపీఎల్ మెగా టోర్నీ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న వేళ చేసిన ఈ ఫిక్సింగ్ ఆరోపణలు సంచలనంగా మారాయి.
భారీ అంచనాలు ఉన్నా..
ఐపీఎల్లో భారీ అంచనాలు ఉన్న జట్లు పేలవమైన ఆటతో ఓటమి పాలవుతుంటే.. ఎటువంటి అంచనాలు లేని జట్లు భారీ విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 18వ సీజన్ లో సగానికి పైగా మ్యాచులో పూర్తవ్వగా.. ప్రస్తుతం రివేంజ్ వీక్ కొనసాగుతోంది. ఐపీఎల్ పూర్తిగా యువ ప్లేయర్లకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ ఏడాది కూడా వేలంలో ఎక్కువగా యువ క్రికెటర్లను సొంతం చేసుకుంది. కానీ ఈ సీజన్ లో ఆ జట్టు ఊహించిన దాని కంటే భిన్నంగా ఆడుతు దారుణమైన ఓటములను మూటగట్టుకుంది. అలాగే గెలిచే మ్యాచ్‌లో చివరకు ఓడిపోయి విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో రాజస్థాన్ జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి.
గెలిచే మ్యాచ్‌లో ఓడిన రాజస్థాన్
గత శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు చేయలేక ఓటమికి తల వంచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66), ఆయుష్ బదోని(34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. అబ్దుల్ సమద్(10 బంతుల్లో 4 సిక్స్‌లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో వానిందు హసరంగా(2/31) రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, జోఫ్రా ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు.