IPL: బెంగళూరు హ్యాట్రిక్ విజయం
ప్లే ఆఫ్ కు అడుగు దూరంలో బెంగళూరు... ఢిల్లీపై ఘన విజయం;
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హ్యాట్రిక్ కొట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. బెంగళూరులో ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో ఎదురైన పరాభవానికి ఢిల్లీలో బెంగళూరు రివెంజ్ తీర్చుకుంది. వరుసగా మూడో విజయాన్ని అందుకున్న ఆర్‌సీబీ, సీజన్‌లో ఏడో విజయంతో టేబుల్ టాప్ పొజిషన్‌లోకి దూసుకెళ్లింది. సీజన్‌లో ఆరోసారి హాఫ్ సెంచరీతో మెరిసిన విరాట్ కోహ్లీతో పాటు కృనాల్ పాండ్యా టాప్ క్లాస్ ఇన్నింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి సునాయాస విజయాన్ని అందించారు. మిగిలిన మ్యాచుల్లో ఇంకో మ్యాచ్ గెలిచినా ఆర్‌సీబీ, ప్లేఆఫ్స్ కు చేరే అవకాశం ఉంది.**
ఢిల్లీ బ్యాటర్ల కట్టడి
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీని బెంగళూరు బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఫాఫ్ డు ప్లిసిస్, అభిషేక్ పోరెల్ కలిసి ఓపెనింగ్ చేశారు. 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన అభిషేక్ పోరెల్, హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కరణ్ నాయర్ ఓ ఫోర్ బాది అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ (41; 39 బంతుల్లో) రాణించగా.. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (34; 18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించాడు. ఓపెనర్ అభిషేక్ పోరెల్ (28; 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఫాఫ్ డుప్లెసిస్ (22), అక్షర్ పటేల్ (15) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, హేజిల్‌వుడ్ 2, యశ్ దయాళ్, కృనాల్ పాండ్య చెరో వికెట్ తీశారు.**
సునాయసంగా...
లక్ష్యఛేదనకు దిగిన ఆర్సీబీకి శుభారంభమేమీ దక్కలేదు. తొలి రెండు ఓవర్లలో 19 పరుగులు రాగా.. అక్షర్ పటేల్ వేసిన మూడో ఓవర్‌లో మూడు బంతుల వ్యవధిలో జాకబ్ బెథెల్ (12), దేవ్‌దత్ పడిక్కల్ (0) ఔటయ్యారు. రజత్ పటీదార్ (6) కోహ్లీతో సమన్వయ లోపంతో రనౌటయ్యాడు. కృనాల్ పాండ్య, కోహ్లీ నిలకడగా సింగిల్స్, డబుల్స్ రాబడుతూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 10 ఓవర్లకు స్కోరు 64/3కి చేరగా.. కుల్‌దీప్ బౌలింగ్‌లో సిక్సర్ రాబట్టిన కృనాల్.. అక్షర్ వేసిన 15 ఓవర్‌లో ఫోర్ కొట్టి అర్ధ శతకం అందుకున్నాడు. మరోవైపు, సింగిల్స్‌తో స్ట్రైక్‌రోటేట్ చేసిన కోహ్లీ 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత టిమ్ డేవిడ్ (19; 5 బంతుల్లో) వరుసగా 6, 4, 4, 4 బాదేసి పని పూర్తి చేశాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశాడు. ఆర్సీబీకి ఇది ఏడో విజయం.