IPL: చెన్నై సూప‌ర్ కింగ్స్ ఘోర ఓట‌మి

50 పరుగుల తేడాతో బెంగళూరు ఘన విజయం...17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర;

Update: 2025-03-29 01:30 GMT

సొంత‌ మైదానంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓట‌మి పాలైంది. RCB నిర్దేశించిన 197 పరుగుల లక్ష్య ఛేద‌న‌లో CSKకి ఆదిలోనే పెద్ద షాక్ త‌గిలింది. రెండో ఓవ‌ర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. మిగిలిన బ్యాటర్లు కూడా క్యూ కట్టారు. దీంతో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసింది. రచిన్‌ రవీంద్ర 41, జడేజా 25, ధోనీ 30* తప్పితే మిగిలిన CSK బ్యాటర్లు సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు.ఈ గెలుపుతో ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్ర సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్‌‌పై 50 పరుగుల భారీ తేడాతో గెలుపొంది 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. చెపాక్ మైదానం వేదికగా చివరి సారిగా 2008 సీజన్‌లో గెలుపొందిన ఆర్‌సీబీ.. ఆ తరువాత వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని RCB శుక్రవారం రాత్రి అద్భుత విజయాన్ని అందుకొని.. తమ ఓటముల పరంపరకు చెక్ పెట్టింది.

మెరిసిన పాటిదార్

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్‌ సాల్ట్‌ మెరుపు ఆరంభాన్ని అందించాడు. కింగ్ కోహ్లీ మాత్రం షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడ్డాడు. కెప్టెన్‌ రజత్‌ పటీదార్‌ మూడు క్యాచ్‌లను చెన్నై ఫీల్డర్లు వదిలేయడం ఆర్‌సీబీ భారీ స్కోరుకు కారణమైంది. సాల్ట్- కోహ్లీ తొలి వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నెమ్మదిగా ఆడి ఒత్తిడికి లోనైన విరాట్‌ను నూర్‌ అహ్మద్‌ అవుట్‌ చేశాడు. 14వ ఓవర్‌లో రజత్‌ 6,4,4తో 15 రన్స్‌తో స్కోరు మళ్లీ వేగం పుంజుకుంది. లివింగ్‌స్టోన్‌ (10), జితేశ్‌ (12) స్వల్ప స్కోర్లకు వెనుదిరగ్గా, 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన పటీదార్‌ 19వ ఓవర్‌లో భారీ షాట్‌కు వెళ్లి పతిరాణకు చిక్కాడు. బెంగళూరు బ్యాటర్లలో రజత్‌ పటీదార్‌ (32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 51), సాల్ట్‌ (16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 32), విరాట్‌ (30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 31) రాణించారు. ఆఖరి ఓవర్‌లో టిమ్‌ డేవిడ్‌ (22 నాటౌట్‌) హ్యాట్రిక్‌ సిక్సర్లతో 19 రన్స్‌ అందించడంతో ఆర్‌సీబీ 196 పరుగులు చేయగలిగింది.

తడబ‌డ్డ చెన్నై

197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆరంభం నుంచే కష్టాలు పడింది. ఓపెనర్‌ రచిన్‌ మాత్రం కాస్త నిలదొక్కుకోగా.. చివర్లో ధోనీ మెరుపులతో ఊరటనిచ్చాడు. పేసర్‌ హాజెల్‌వుడ్‌ రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ త్రిపాఠి (5), కెప్టెన్‌ రుతురాజ్‌ (0)లను వెనక్కి పంపి షాకిచ్చాడు. దీపక్‌ హుడా (4)ను భువనేశ్వర్‌ అవుట్‌ చేయడంతో జట్టు పవర్‌ప్లేలో 30/3 స్కోరుకే పరిమితమైంది. శామ్ కరణ్ కూడా8 పరుగులకే అవుటయ్యాడు. ఈ దశలో రచిన్‌-దూబే జోడీ అడపాదడపా బౌండరీలతో ఆశలు రేపింది. అయితే 13వ ఓవర్‌లో పేసర్‌ యష్‌ ఈ ఇద్దరినీ బౌల్డ్‌ చేసి చెన్నై ఓటమి ఖాయం చేశాడు. అశ్విన్‌ (11)ను స్పిన్నర్‌ లివింగ్‌స్టోన్‌ అవుట్‌ చేశాక 16వ ఓవర్‌లో ధోనీ క్రీజులోకి వచ్చాడు. అప్పటికి సమీకరణం 29 బంతుల్లో 98 రన్స్‌గా ఉండడంతో చెపాక్‌లో బెంగళూరు విజయం ఖాయమైంది. జడేజా -ధోనీ మధ్య 8వ వికెట్‌కు అత్యధికంగా 31 పరుగులు జత చేరినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్‌లో 67 రన్స్‌ అవసరపడగా.. ధోనీ 6,6,4తో ఫ్యాన్స్‌లో కాస్త జోష్‌ నింపాడు.

Tags:    

Similar News