IPL: రాజస్థాన్‌ను చిత్తు చేసిన ముంబై
ప్లే ఆఫ్ రేసు నుంచి రాజస్థాన్ అవుట్... 100 పరుగుల తేడాతో ముంబై గెలుపు;
ఐపీఎల్‌లో ముంబై జైత్రయాత్ర కొనసాగుతోంది. రాజస్థాన్‌పై ముంబై ఇండియన్స్ సాధికార విజయం సాధించింది. అన్ని విభాగాల్లో రాణించిన ముంబై జట్టు.. రాజస్థాన్‌కు ఏ అవకాశం ఇవ్వలేదు. గత మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీతో అద్భుతం చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. అనంతరం 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ను ముంబై బౌలర్లు వణికించారు. ముంబై బౌలర్లు నిప్పుులు చెరగడంతో రాజస్థాన్ 117 పరుగులకే కుప్పకూలింది. దీంతో 100 పరుగుల తేడాతో ముంబై గెలిచింది. ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.
రాణించిన ముంబై టాపార్డర్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు ర్యాన్ రికిల్టన్, కెప్టెన్ రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. రికిల్టన్ దూకుడుగా ఆడి కేవలం 38 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 36 బంతుల్లో 9 ఫోర్ల సహాయంతో 53 పరుగులు చేసిన రోహిత్‌ను పరాగ్ అవుట్ చేశాడు. అనంతరం హార్దిక్, సూర్య స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరూ కేవలం 23 బంతుల్లోనే 48 పరుగులు చొప్పున చేసి అజేయంగా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 217 పరుగుల భారీ స్కోరును నమోదు చేశారు.
కుప్పకూలిన రాజస్థాన్
218 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ను ముంబై బౌలర్లు వణికించారు. ఎవరూ కనీసం పోరాడే ప్రయత్నమే చేయలేదు. మొదటి ఓవర్‌లో ప్రారంభమైన వికెట్ల పతనం నిరాటంకంగా కొనసాగింది. గత మ్యాచ్ సెంచరీ హీరో వైభవ్ డకౌట్ అయ్యాడు. జైస్వాల్ 13, నితీశ్ రాణా 9, పరాగ్ 16, జురెల్ 11, హెట్ మెయిర్ 0కు వెనుదిరిగారు. రాజస్థాన్‌లో ఆర్చర్ మినహా ఏ ఒక్క బ్యాటర్ 20 పరుగుల మైలురాయిని కూడా దాటలేదు. దీంతో రాజస్థాన్ 117 పరుగులకే పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది.