ISHAN KISHAN: ఇ"షాన్‌దార్"..టీమిండియా నయా స్టార్
టీమిండియాకు అనుకోని హీరో.... అనూహ్యంగా జట్టులోకి ఇషాన్.. అంచనాలను మించి రాణింపు
భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ, ఒత్తిడి, భావోద్వేగాల తుఫాను. అలాంటి పోరులో అంచనాలు అంతా ఒకరిపై ఉండగా, మరో ఆటగాడు మెరుపువేగంతో రంగంలోకి దిగి మ్యాచ్‌ను తలకిందులు చేయడం అరుదైన సంఘటన. కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లో అదే జరిగింది. భారీ అంచనాలు లేకుండానే క్రీజులోకి దిగిన ఇషాన్ కిషన్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ భారత అభిమానుల మదిలో చాలా కాలం నిలిచిపోవడం ఖాయం. మ్యాచ్‌కు ముందు వరకూ భారత టీ20 జట్టులో ప్రధాన ఆకర్షణగా ఉన్నది అభిషేక్ శర్మ. పాక్‌పై కూడా అతడిపైనే అందరి దృష్టి. కానీ అతను డకౌట్ కావడంతో జట్టు ఒత్తిడిలో పడింది. కొలంబో పిచ్ స్వభావం బ్యాటింగ్‌కు సహకరించకపోవడం, స్పిన్నర్లకు అధికంగా అనుకూలించడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇషాన్ కిషన్ క్రీజులో నిలబడి ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది.
ఈ మ్యాచ్‌లో ఇషాన్ ఒక్కడే ఒక వైపు నిలిస్తే, మిగతా బ్యాటర్లు మరో వైపు ఉన్నట్లే అనిపించింది. స్పిన్‌కు విపరీతంగా సహకరించిన నెమ్మదైన పిచ్‌పై బౌండరీలు సాధించడం చాలా కష్టమైంది. అవుట్ ఫీల్డ్ కూడా మందగించడంతో బలంగా కొట్టిన షాట్లు కూడా బౌండరీకి చేరడం కష్టంగా మారింది. ఇషాన్ తప్ప మరెవరూ అర్ధశతకం నమోదు చేయలేకపోయారు. 20 పరుగులు దాటిన బ్యాటర్లలో ఇషాన్ స్ట్రైక్ రేట్ 192.5 ఉండగా, శివమ్ దూబే మాత్రమే 150 మార్క్ దాటగలిగాడు. దూకుడుగా ఆడే సూర్యకుమార్ యాదవ్ సైతం 29 బంతుల్లో 110 స్ట్రైక్ రేట్‌కే పరిమితమయ్యాడు. తిలక్ వర్మ కూడా స్పిన్‌ను ఎదుర్కొనే క్రమంలో ఇబ్బంది పడ్డాడు.
ఇషాన్ మాత్రం పరిస్థితులకు భిన్నంగా ఆడాడు. ప్రతి బంతిని గమనిస్తూ, అవకాశమొస్తే దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని సందర్భాల్లో అతను గాల్లోకి లేపిన షాట్లు అభిమానుల్లో ఆందోళన కలిగించినా, అదే ధైర్యం అతనికి విజయాన్ని అందించింది. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని అడ్డదిడ్డంగా కాకుండా లెక్కచేసిన దాడులు చేశాడు. గ్యాప్‌లను గుర్తించి ఫోర్లు, సిక్సర్లు సాధించాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు పిచ్ క్లిష్టత కనిపించలేదు. కానీ అతను ఔట్ అయిన తర్వాత మిగతా బ్యాటర్ల తడబాటు చూస్తే అతని ఇన్నింగ్స్ విలువ మరింత స్పష్టమైంది. ఈ ఇన్నింగ్స్ లేకపోతే మ్యాచ్ ఏకపక్షంగా మారే అవకాశం ఉండేది. రెండు జట్ల మధ్య తేడా ఇషాన్ ఒక్కరే అన్నట్టుగా పరిస్థితి మారింది. చివరికి భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. అయితే విజయం కోసం పునాది వేసింది మాత్రం ఇషాన్ ఇన్నింగ్సే. ఆసక్తికర విషయం ఏమిటంటే, రెండు నెలల క్రితం వరకూ ఇషాన్ జాతీయ జట్టులో స్థానం కోసం పోరాడుతున్న ఆటగాడు మాత్రమే. రెండేళ్లకు పైగా ఏ ఫార్మాట్లోనూ భారత్ తరఫున ఆడని అతను టీ20 ప్రపంచకప్ జట్టులో ఉంటాడని ఎవరూ ఊహించలేదు. కానీ ముస్తాక్ అలీ టోర్నీలో మెరిసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా ఎంపికై, తర్వాత అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.