JEMIMA: ఆసీస్ మీడియా మనసు దోచిన జెమీమా
జెమీమాపై క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు
మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీలో సంచలన ఇన్నింగ్స్‌తో టీమ్ఇండియాను ఫైనల్‌కు చేర్చిన జెమీమా రోడ్రిగ్స్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె పోరాటం అద్భుతం అంటూ దిగ్గజ క్రికెటర్లు మెచ్చుకుంటున్నారు. ‘‘ఆస్ట్రేలియా వంటి బలమైన ప్రత్యర్థిపై మన జట్టు అద్భుత విజయం సాధించింది. భారీ టార్గెట్‌ను ఛేదించడం తేలికైన విషయం కాదు. ఇలాంటి తీవ్ర ఒత్తిడి ఉన్న మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ సూపర్‌గా ఆడింది. నమ్మకం, ఆటపై అభిరుచి, గెలవాలనే తపనే ఇందుకు కారణం. వెల్డన్ టీమ్ఇండియా’’ అని విరాట్ పోస్టు చేశాడు. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిమానులకు ఓ హామీ ఇచ్చాడు. సెమీస్‌లో అజేయంగా సెంచరీ చేసిన జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి పాట పాడతానని వెల్లడించాడు. అయితే, జెమీమా అందుకు అంగీకరిస్తేనేనని స్పష్టంచేశాడు. భారత పురుషుల జట్టు టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు మైదానంలోనే డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.
సాధారణంగా ఆస్ట్రేలియా ఓడిపోతే ప్రత్యర్థి జట్టు, ఆటగాళ్లపై ఆ దేశ మీడియా అక్కసు వెళ్లగక్కుతుంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలు. భారత పురుషుల జట్టు బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో గెలిచినా.. యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ మంచి ప్రదర్శన చేసినా ఏదొక కారణం చూపుతూ ఆసీస్ ఓటమిని తక్కువ చేసి చూపించేవి. కానీ, ఈసారి మాత్రం అలా కాదు. ఆ దేశ మీడియా పతాక శీర్షికల్లో టీమ్ఇండియా మహిళా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌పై ప్రశంసల వర్షం కురిపించాయి. ఇక తమ జట్టు కెప్టెన్ ఎలీసా హీలీపై విమర్శలు చేశాయి. జెమీమా ఇచ్చిన క్యాచ్‌ను చేజార్చడం వల్లే తమ జట్టు ఓడిపోయిందని అందులో పేర్కొన్నాయి. ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ మరో 9 బంతులు మిగిలిఉండగానే విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ 127 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆసీస్ మీడియా ఏబీసీ న్యూస్ జెమీమా ప్రదర్శనను అభినందిస్తూ ‘స్టన్నింగ్ ఇన్నింగ్స్. అద్భుతమైన లక్ష్య ఛేదన’ అంటూ కామెంట్ చేసింది. ఇక ఫాక్స్ క్రికెట్ కూడా జెమీమాను అభినందిస్తూనే ఎలీసా హీలీని విమర్శించింది. ‘ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడానికి ప్రధాన కారణం క్యాచ్‌లు డ్రాప్ చేయడమే. రికార్డు లక్ష్య ఛేదనలో జెమీమా జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడింది’’ అని కథనాల్లో పేర్కొంది. ‘గుడ్ మార్నింగ్ ఆస్ట్రేలియా. భారత్ అద్భుతమైన రన్ ఛేజింగ్‌తో వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కథ ముగిసింది’ అని పోస్టు పెట్టింది. జెమీమా తన ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల మనసు దోచుకుంది.