RABADA: డ్రగ్స్ వల్లే ఐపీఎల్‌కు దూరం: రబాడ
రబాడ వ్యాఖ్యలతో నివ్వెరపోయిన క్రికెట్ ప్రపంచం;
గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబాడ సంచలన విషయాలు వెల్లడించాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో రబాడ తొలి రెండు మ్యాచ్‌లు గుజరాత్ తరపున ఆడాడు. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ పై బరిలోకి దిగి ఒక్కో వికెట్ చొప్పున తీశాడు. ఈ మ్యాచ్ లు ముగిశాక వ్యక్తిగత కారణాలు అంటూ రబాడ అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. తాజాగా ఈ పర్సనల్ రీజన్ కు గల కారణాన్ని రబాడ వెల్లడించాడు. నిషేధిత డ్రగ్‌ను వాడనే సస్పెన్షన్ కారణంగా ఐపీఎల్ ను వీడాల్సి వచ్చిందని తాజాగా పేర్కొన్నాడు. జరిగిన దానిపై తాను చింతిస్తున్నానని, మరింత బలంగా దీని నుంచి బయట పడి వస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు.
ఏ డ్రగ్ వాడాడో తెలీదు
అయితే రబాడ ఏం డ్రగ్ వాడాడో వెల్లడించలేదు. మొత్తం మీద రబాడ తాజా ప్రకటనతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా నివ్వెర పోయింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన చర్చ జరుగుతోంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెటర్ల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. గతేడాది మెగావేలంలో రబాడను రూ.10.75 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసింది. తనను మెయిన్ బౌలర్ గా భావించి, భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే పర్సనల్ రీజన్స్ తో తను లీగ్ ఆరంభంలోనే వైదొలిగినా, వెంటనే తేరుకుంది. ఇప్పటివరకు టోర్నీలో 10 మ్యాచ్ లాడిన గుజరాత్ ఏడు విజయాలతో టాప్ -2లో కొనసాగుతోంది. మరొక్క విజయం సాధిస్తే దాదాపుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది.