టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాడు. టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన కోహ్లీ.. కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే భారత జట్టు తరఫున వన్డేల్లో పునరాగమనం చేసేందుకు కోహ్లీ కసరత్తు చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో మూడువన్డేల సిరీస్‌తో కోహ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా ఈ సిరీస్ జరగనుంది. ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత ఆటకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ.. మళ్లీ ఆటపై పట్టు పెంచుకునేందుకు ముందుగానే సన్నాహకాలు ప్రారంభించాడు. లార్డ్స్ వేదికగా ఇండోర్ నెట్స్‌లో రెండు గంటలపాటు బ్యాటింగ్ సాధన చేశాడు. స్పిన్, ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు వీరిద్దరూ టీమ్‌లో కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే దీనిపై ప్రస్తుతానికి అనిశ్చితి నెలకొంది. వారి వయసు రీత్యా వన్డే ప్రపంచకప్ ఆడటం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ప్రచారం కూడా మొదలైంది. అయితే ఈ వాదనను తాజాగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఖండించాడు.
అయ్యర్‌ను పక్కన పెట్టడం సరికాదు
భారత సెలెక్షన్ కమిటీపై మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టాడు. శుభ్‌మన్ గిల్ కోసం శ్రేయస్ అయ్యర్‌ను పక్కన పెట్టడం సరికాదని మండిపడ్డాడు. ఆసియా కప్ 2025 కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ సూర్యకుమార్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. దాంతో సెలెక్షన్ కమిటీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.