IPL: ఉత్కంఠభరిత పోరులో కోల్‌కత్తా విజయం
ఒక్క పరుగు తేడాతో గెలుపు... పోరాడి ఓడిన రాజస్థాన్;
ఐపీఎల్‌లో మరో ఉత్కంఠభరిత సమరం అభిమానులను అలరించింది. చివరి బంతి వరకూ విజయం దోబూచులాడిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై కోల్‌కత్తా కేవలం ఒకే పరుగు తేడాతో విజయం సాధించింది. ఓ దశలో విజయ అవకాశాలే లేని రాజస్థాన్ అద్భుత పోరాటం చేసింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన దశలో రాజస్థాన్ కేవలం ఒక్క రన్ మాత్రమే స్కోరు చేయడంతో కోల్‌కత్తా.. ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో కోల్‌కత్తా ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గెలుపు గీతను దాటింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 1 పరుగు తేడాతో ఓడించింది. టోర్నీలో ఐదో విజయాన్ని సాధించి.. పాయింట్స్ టేబుల్‌లో ఆరో ప్లేసుకు చేరుకుంది.
రియాన్ పరాగ్ అద్భుతం
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. రస్సెల్ (57*; 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్యఛేదనలో రాజస్థాన్ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. కెప్టెన్ రియాన్ పరాగ్ (95; 45 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) పోరాటం వృథా అయింది. యశస్వి జైస్వాల్ (34; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), హెట్‌మయర్ (29; 23 బంతుల్లో) రాణించారు. చివర్లో శుభమ్ దూబె (25*; 14 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), జోఫ్రా ఆర్చర్ (12; 8 బంతుల్లో) పోరాడినా రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు.
చివరి ఓవర్ ఇలా...
చివరి 3 ఓవర్లలో 38 పరుగులు కావాల్సి ఉండగా.. పరాగ్‌ను కూడా హర్షిత్ వెనక్కిపంపాడు. ఆఖరి 6 బంతుల్లో రాజస్థాన్ విజయానికి 22 పరుగులు అవసరమవగా.. వైభవ్ అరోరా బౌలింగ్‌లో శుభం దూబె (14 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 25 నాటౌట్) 6,4,6 బాదడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా.. దూబే సింగిల్ మాత్రమే తీశాడు. రెండో పరుగు కోసం వచ్చిన ఆర్చర్ (12) రనౌటయ్యాడు.