KOHLI: ఫ్రాంచైజీ పార్ట్నర్గా మారనున్న కింగ్ కోహ్లీ..!
ఆర్సీబీని కొనేందుకు అనుష్కతో స్కెచ్... డీల్ రూ.400 కోట్లు ఉంటుందని అంచనా.. అధికార ప్రకటన లేకున్నా ప్రచారం
ఐపీఎల్లో అభిమానుల ప్రేమకు, బ్రాండ్ విలువకు ప్రతీకగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ఇప్పుడు భారీ వ్యాపార చర్చ నడుస్తోంది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్ మొత్తం ఆడిన ఫ్రాంచైజీతో యాజమాన్య స్థాయిలోనూ అనుబంధం పెంచుకునే ఆలోచనలో ఉన్నాడన్న వార్తలు క్రీడా, వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ప్రక్రియలో ఆయన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పేరు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ఆర్సీబీలో మైనారిటీ వాటాను అనుష్క శర్మ పేరిట కొనుగోలు చేయాలనే యోచన కోహ్లీ దంపతులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ డీల్ విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉండవచ్చని బిజినెస్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా, ఈ వార్తలు సోషల్ మీడియా, ఫైనాన్షియల్ వర్గాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కోహ్లీకి ఆర్సీబీతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఐపీఎల్ ప్రారంభం నుంచీ ఈ ఫ్రాంచైజీకి ఐకాన్ ప్లేయర్‌గా కొనసాగిన కోహ్లీ, మాజీ కెప్టెన్‌గా జట్టును కొత్త స్థాయికి తీసుకెళ్లాడు. ఇప్పుడు ఆటగాడిగా కాకుండా, ఫ్రాంచైజీ భాగస్వామిగా మారాలనే ఆలోచనలో ఉన్నాడన్న వార్తలు అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి.
అమ్మకానికి ఆర్సీబీ?
ప్రస్తుతం ఆర్సీబీ ఫ్రాంచైజీ యాజమాన్యం డియాజియో ఇండియా చేతుల్లో ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే ఆర్సీబీని అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఫ్రాంచైజీ విలువ సుమారు 2 బిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.17,000 కోట్లు) ఉంటుందని అంచనా.నడియాజియో ప్రధానంగా మద్యం వ్యాపారంలో ఉన్న సంస్థ. అమెరికా దాని అతిపెద్ద మార్కెట్ కాగా, అక్కడ సుంకాలు పెరిగాయి. వినియోగదారుల సంఖ్య తగ్గడం వల్ల ప్రీమియం మద్యం అమ్మకాలపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆర్సీబీ వంటి నాన్-కోర్ ఆస్తులను విక్రయించి ప్రధాన వ్యాపారంపై పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలో డియాజియో ఉందన్న కథనాలు వస్తున్నాయి. అయితే ఈ అంశంపై సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలవడం ఫ్రాంచైజీ బ్రాండ్ విలువను భారీగా పెంచింది. ఈ విజయం వల్ల అభిమానుల క్రేజ్ మరింత పెరగడంతో పాటు, కమర్షియల్ విలువ కూడా రెట్టింపు అయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునే దిశగా డియాజియో ఆలోచిస్తోందన్న ప్రచారం మరింత బలపడింది.
ఆసక్తి చూపుతున్న ప్రముఖులు
ఆర్సీబీ కొనుగోలు రేసులో అనేక ప్రముఖ పేర్లు వినిపిస్తున్నాయి. అదానీ గ్రూప్, ఢిల్లీ క్యాపిటల్స్ కో-ఓనర్ జేఎస్‌డబ్ల్యూ భాగస్వామి జిందాల్ గ్రూప్, వ్యాపారవేత్త ఆదర్ పూనావాలా, కన్నడ సినీ పరిశ్రమకు చెందిన హోంబాలే ఫిల్మ్స్‌తో పాటు రెండు అమెరికన్ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా, అనుష్క శర్మతో పాటు బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ కూడా సుమారు 2 శాతం వాటా కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వాటా విలువ దాదాపు రూ.300 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. దీంతో ఆర్సీబీ యాజమాన్య మార్పులపై చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. పీఎల్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లు ఫ్రాంచైజీల్లో వాటాలు కలిగి ఉండరాదన్న స్పష్టమైన నియమం ఉంది.